* రోజువారి విచారణకు అనుమతించిన సిబిఐ కోర్టు...
* డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకెళ్లట్లేదని కోర్టుకు తెలిపిన ఈడి...
* ఈడి వాదనతో ఏకీభవించిన కోర్టు...
హైదరాబాద్ :
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇకపై సీబీఐ, ఈడీ కేసులను రోజువారీ విచారించేందుకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. జగన్ సహా 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించనుంది. కాగా కేసులపై రోజువారీ విచారణ జరిపి వెంటనే తేల్చాలని ఇటీవల తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. సీబీఐ కోర్టులో తొమ్మిది ఈడీ ఛార్జిషీట్లు గడచిన పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకెళ్లట్లేదని వివరించింది.
ఈ నేపధ్యంలో అక్రమాస్తులు, క్విడ్ ప్రో కో కేసుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను కొట్టేస్తూ షాక్ ఇచ్చింది. విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. జగన్‌కు మినహాయింపు ఇస్తే దర్యాప్తు, విచారణ మరింత ఆలస్యమవుతుందని సీబీఐ వాదించగా, దీంతో కోర్టు ఏకీభవించింది. జగన్‌పై సీబీఐకి సంబంధించి 11 కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి సంబంధించి 9 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా... ఈడి వాదనతో కోర్టు ఏకీభవించడం చర్చనీయాంశంగా మారింది.