* నాకు ప్రాణహానీ ఉంది...
*ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారు...
*చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు తెలిసే జరుగుతోందా?
* పోలీసులు అధికారుల్లా పనిచెయ్యడం లేదు....
Tadipatri :
తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని..టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ అరోపించారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు.
అనంతపురం ఎస్పీ జగదీష్‌ను ఉద్దేశించి కూడా పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. తన ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, తన గన్‌మెన్‌ను ట్రాప్ చేసి తన కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల తీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల వైఖరిని ప్రశ్నించారు. అనంతపురం ఎస్పీ జగదీష్ ఈ అరాచకాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.
తాడిపత్రిలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు వారి డ్యూటీ చెయ్యడం లేదని, పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరించడం దుర్మార్గం. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ కల్పించలేని పోలీసులు ఎందుకు?. థర్డ్ పార్టీ విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి" అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.
ఇటీవలే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆయన కాన్వాయ్‌కు చెందిన స్కార్పియో వాహనం ధ్వంసమైన ఘటన జరిగిన నేపథ్యంలో, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.