విజయవాడ :
జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకున్న కమిటీలన్నింటిని రద్దు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. త్వరలోనే మళ్లీ కొత్త కమిటిలు వేసేలా అదేశాలు జారీ చేశారు. దీంతో త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు కనపడుతొంది. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసి, ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వీలుగా నియోజకవర్గాల వారీగా త్వరలోనే నూతన సమన్వయ కమిటీలను నియమించాలని పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఈ మేరకు పార్టీ సమన్వయ వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత పర్యవేక్షణ బృందాలు, పార్లమెంట్ స్థాయి కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో నియమించిన నియోజకవర్గ సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు, వాటికి అనుబంధంగా పనిచేస్తున్న సపోర్ట్ టీమ్స్‌ను పూర్తిగా రద్దు చేశారు. ఇవి ఇకపై చెల్లుబాటులో ఉండవని స్పష్టం చేశారు. వీటితో పాటు 25 మంది సభ్యులతో నియోజకవర్గాల పరిధిలో పనిచేస్తున్న పార్లమెంట్ కమిటీలను కూడా పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరొకవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వ్యూహాల కోసం ఇటీవల రాష్ట్ర స్థాయిలో నియమించిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక సమన్వయ కమిటీ యథావిధిగా విధుల్లో కొనసాగుతుందని పార్టీ తెలిపింది. దీంతో పాటు రాష్ట్ర ప్రచార కమిటీలు కూడా తమ బాధ్యతలను యథాతథంగా నిర్వర్తిస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల వ్యాప్తంగా నూతన పర్యవేక్షణ, సమన్వయ కమిటీలను ప్రకటించనున్నారు. కొత్త కమిటీల ద్వారా స్థానిక ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన నిర్ణయాలు తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది.