- * పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్ ముగ్గురూ ఒకే వేదికపై
- * చైనాలో త్రైపాక్షిక భేటీకి ప్లాన్!
Astranews desk. :
ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే భారీ పరిణామం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ముగ్గురూ కలిసి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ బుధవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. మంగళవారం పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో చైనాలో జరగబోయే APEC సదస్సు సందర్భంగా త్రైపాక్షిక భేటీ గురించి చర్చించారని తెలిపారు. "ఈ అవకాశం గురించి గతంలోనూ ప్రస్తావన వచ్చింది, ఇప్పుడు అలాంటి అవకాశం ఉంది" అని పెస్కోవ్ చెప్పారు.
*ఎప్పుడు, ఎక్కడ?... :
ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సు ఈ ఏడాది నవంబర్ 18, 19 తేదీల్లో చైనాలోని షెన్‌జెన్ నగరంలో జరగనుంది. ఈ సదస్సుకు పుతిన్ హాజరవుతారని రష్యా ప్రకటించింది, అయితే ట్రంప్ హాజరుపై వైట్ హౌస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
* ఎందుకు ఇంత ప్రాధాన్యం.. ?
ప్రపంచంలోని మూడు అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలు ఒకేసారి కలవడం అనేది ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతల వేళ అత్యంత కీలకం.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా రాయబారులు గత వారమే మాస్కో, కీవ్ లలో పర్యటించినా ఫలితం లేకపోయింది. ఇటీవల రష్యా-చైనా బంధం మరింత బలపడింది. అమెరికాకు చైనాతో వాణిజ్య పోటీ, రష్యాతో యుద్ధం అంశం రెండూ కీలకం.
APEC వేదిక 1980ల నాటి ఆర్థిక సహకార వేదిక అయినా, ఈసారి అది ప్రపంచ శాంతి చర్చలకు అత్యంత ముఖ్యమైన వేదికగా మారే అవకాశం ఉంది.
అయితే క్రెమ్లిన్ ప్రకటన కేవలం అవకాశం గురించి చర్చ జరిగిందని మాత్రమే చెబుతోంది. ముగ్గురు నేతల భేటీ అధికారికంగా ఖరారు కాలేదు.