* బ్లాక్‌మార్కెట్, దళారీ దోపిడీని అరికట్టి ...ధరల భారాన్ని తగ్గించాలి...
* సెప్టెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిరసనలు
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు
విజయవాడ. :
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరల పై సిపిఐ పోరుబాట కు సమాయత్తమైంది. ఈ పోరుబాట లో భాగంగా ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
ధరలతో పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఒకవైపు ప్రజల ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కుటుంబ బడ్జెట్లను ఛిద్రం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు కొనలేని పరిస్థితి, పప్పు వండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి, వంటనూనె వినియోగించాలంటే జేబు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సామాన్యుడి వంటిల్లు నేడు అగ్నిగుండంగా మారిందని పేర్కొన్నారు.
2014తో పోలిస్తే నేడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయని ఈశ్వరయ్య తెలిపారు. బియ్యం కిలో ధర ₹28.06 నుంచి ₹45.69కు పెరిగిందని, అంటే సుమారు 63 శాతం పెరుగుదల నమోదైందన్నారు. కందిపప్పు ధర ₹75.94 నుంచి ₹122.06కు పెరిగి సుమారు 61 శాతం పెరిగిందని తెలిపారు. సన్‌ఫ్లవర్ వంటనూనె ధర ₹93.55 నుంచి ₹192.40కు పెరిగి 105 శాతం మేర పెరిగిందని, చక్కెర ధర ₹34.02 నుంచి ₹60.78కు పెరిగి సుమారు 79 శాతం, ఉల్లిపాయ ధర ₹26.46 నుంచి ₹50.19కు పెరిగి సుమారు 90 శాతం, టమాటా ధర ₹21.44 నుంచి ₹37.67కు పెరిగి సుమారు 76 శాతం పెరిగిందని వివరించారు.
ముఖ్యంగా వంటనూనె ధర రెట్టింపుకుపైగా పెరగడం, ఉల్లిపాయ ధర దాదాపు రెట్టింపు కావడం, బియ్యం, కందిపప్పు, చక్కెర, టమాటా ధరలు గణనీయంగా పెరగడం ప్రజలపై పడుతున్న ధరల భారానికి నిదర్శనమన్నారు. ధరలు ఇంత భారీగా పెరుగుతుంటే ప్రజల ఆదాయాలు కూడా అదే స్థాయిలో పెరిగాయా, సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగిందా అని ఈశ్వరయ్య ప్రశ్నించారు.
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, అదే పంట మార్కెట్‌కు వచ్చేసరికి వినియోగదారుడు మాత్రం అధిక ధర చెల్లించాల్సి వస్తోందని అన్నారు. రైతు దగ్గర తక్కువ ధర, వినియోగదారుడి దగ్గర అధిక ధర ఉండగా, మధ్యలో దళారీ వ్యవస్థ భారీగా లాభపడుతోందని విమర్శించారు. రైతు నుంచి వినియోగదారుడి వరకు కొనసాగుతున్న ఈ దోపిడీ గొలుసును తెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, దళారీ వ్యవస్థ, బ్లాక్‌మార్కెట్ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కృత్రిమంగా పెంచుతున్నా వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఈశ్వరయ్య విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నప్పటికీ, మార్కెట్‌లో ధరల మంట ఎందుకు అదుపులోకి రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ధరలను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నా ప్రజల కొనుగోలు శక్తి, కుటుంబాలపై పడుతున్న భారాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
ధరల పెరుగుదల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుండగా, రైతుల ఆదాయం కుంచించుకుపోతోందని, మరోవైపు దళారీలు, నిల్వదారుల లాభాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇది కేవలం మార్కెట్‌కు సంబంధించిన సమస్య కాదని, ప్రజల జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న పాలకుల విధాన వైఫల్యమని ఈశ్వరయ్య పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, బ్లాక్‌మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా నిల్వలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌పై సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. రైతు నుంచి వినియోగదారుడి వరకు మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను నియంత్రించి రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి సరసమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుబజార్లను మరింత బలోపేతం చేసి విస్తరించాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈశ్వరయ్య కోరారు. పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారాన్ని తగ్గించి రవాణా ఖర్చులను తగ్గించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలపై అదనపు భారం పడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం VATతో పాటు ఇతర సెస్సులు, డీజిల్‌పై 22.25 శాతం VATతో పాటు ఇతర సెస్సులు ఉన్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఇంధనంపై పన్నుల భారాన్ని తగ్గించడం ద్వారా రవాణా ఖర్చులను, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రజల వంటింటిని మండిస్తున్న ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, బ్లాక్‌మార్కెట్, అక్రమ నిల్వలు, దళారీ దోపిడీని అరికట్టాలని, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహిస్తున్నట్లు గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించే ఈ ఆందోళనల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.