విజయవాడ. :
స్థానిక ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందే విజయవాడ మేయర్ సీటు విషయంలో అధికార పార్టీలో క్యాస్ట్ వార్ మొదలైంది. కీలకమైన రెండు ప్రధాన కులాల మధ్య సీటు చేజిక్కించుకోవడం కోసం జరుగుతున్న వార్ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారింది. డైరెక్ట్ అవకాశం రావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ అవ్వకూడదని.... అన్ని రకాలుగా తమకు టికెట్ ఇవ్వడానికి ఉన్న అర్హతల లెక్కల చిట్టా సిద్ధం చేస్తున్నారు. అయితే అసలు నోటిఫికేషన్ రాకుండా రిజర్వేషన్ ఎవరికీ తేలకుండా నేతలు చేస్తున్న హడావిడిపై మాత్రం ఆలు లేదు చూలు లేదన్న సామెతను గుర్తుకు తెస్తుంది. ఇంతకీ కులాల మధ్య వార్ పీక్ కి వెళ్ళిన మేయర్ సీట్ పై అక్కడ నేతల లెక్కలపై జరుగుతున్న చర్చ చూస్తే.
బెజవాడ నగర మేయర్ గా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగడానికి రెండు ప్రధాన కులాల నుంచి నేతలు పోటీ పడటం రాజకీయంగా చర్చగా మారింది. కూటమిలో రెండు ప్రధాన కులాలుగా ఉన్న కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈ సీట్ కోసం పోటీ పడటంతో పొలిటికల్ వర్గాలో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. దీనికి తోడు జనసేన చాలా రోజులుగా విజయవాడ పైన ఆశలు పెట్టుకుంది. ఇటు టీడీపీ వంగవీటి- బోండా నుంచి మేయర్ సీటు కోసం రేసు మొదలైంది. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. అసలు ఈ సీటు ఏ పార్టీకి దక్కుతుంది.. ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.
కాపు సామాజిక వర్గం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమా తన కుమారుడు బొండ సిద్ధార్థకు సీటు దక్కించడం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి దేవినేని ఫ్యామిలీ నుంచి మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, గతంలో వైసిపి నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ప్రస్తుతం టీడిపీలో ఎంపి కేసినేని చిన్ని వర్గంలో కొనసాగుతున్న బొప్పన భవకుమార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ అధికార పార్టీలో జరుగుతోంది.
గతంలో కార్పొరేటర్లు గెలవగానే అందులో ఒకరిని మేయర్ గా అధిష్టానం నిర్ణయించేది. అయితే 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్షంగా మేయర్ కోసం అభ్యర్థిని బరిలోకి దింపాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకొని అందుకు అనుకూలంగా సవరణలు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వదులుకోకూడదని ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలు పావులు కదపడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారింది. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఈ మేయర్ సీట్ వ్యవహారం కోల్డ్ వార్ గా మారిందన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో నడుస్తుంది.
ఇందులో మొదటి వరుసలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ కుమారుడు బొండ సిద్ధార్థ్ ఉన్నారు. మొన్నటి వరకు అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని తన మాటలతో ఇబ్బంది పెట్టిన బొండా ఉమా ఇప్పుడు తన కుమారుడిని ప్రత్యక్ష ఎన్నికల్లో డైరెక్ట్ గా మేయర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేసివచ్చిన సిద్ధార్థకు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు తల్లి కమ్మ, భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడం కూడా కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటివరకు విజయవాడ మేయర్ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించలేదని ... ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన సిద్ధార్థకు సీటు ఇస్తే అది విజయవాడ నగరంలో మూడు నియోజక వర్గాల్లో ఉన్న కాపులకు టీడిపిని మరింత దగ్గర చేస్తుందనే లెక్కలు చెప్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన తనకి ఇప్పటి వరకు మంత్రి పదవి కూడా దక్కలేదని ఆవేదనకు గురైన బొండా ఉమా తన కుమారుడికి మేయర్ సీటు అధిష్టానం ఇవ్వడం ద్వారానైనా న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. తన కుమారుడికి టికెట్ కేటాయింపు కోసం ఎంపీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నేతలు మద్దతు కూడగట్టే పనిలో ఊమా ఉన్నారట. గతంలో టీడిపి రెండు పర్యాయాలు కమ్మ సామాజిక వర్గానికి మేయర్ సీటు కోసం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈసారి కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న అంశాన్ని తెర మీదకి తెస్తున్నారు. ఇక అధికార పార్టీలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువమంది మేయర్ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
దేవినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేసిన దేవినేని అపర్ణ ఈ సారి మేయర్ సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపికి సన్నిహితంగా ఉండే దేవినేని చంద్రశేఖర్ తన తల్లికి మేయర్ సీటు విషయంలో లైన్ క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే....ఒకవేళ యువతకు జన్ జీ కోటా కింద టికెట్ ఇవ్వాలని భావిస్తే తన భార్య మహితకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారట. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఆర్డిఓలో ఉద్యోగం చేసి ప్రస్తుతం రాజీనామా చేసిన తన భార్య మహితకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా దేవినేని చందు సిద్ధం చేశారని టాక్.
ఇక 2019లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన మాజీ కార్పొరేటర్ బొప్పన భవకుమార్ ప్రస్తుతం టీడిపీ లో చేరి ఎంపి కేసినేని చిన్ని వర్గంలో కొనసాగుతున్నారు. 2014 సమయంలో ఆయన మేయర్ స్థానం కోసం వైసిపి నుంచి పోటీ పడిన అప్పుడు అదృష్టం దక్కకపోవడంతో ఇప్పుడు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వంగవీటి రాధా మద్దతును బొప్పన భావకుమార్ కూడగట్టే పనిలో ఉన్నారని ప్రచారం. ఇక స్వచ్ఛందంగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పట్టాభి కూడా మేయర్ గా బరిలోకి దిగడానికి తన స్థాయిలో
ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. దీంతో విజయవాడ నగరంలో మేయర్ సీటి విషయంలో కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య కాస్ట్ పవర్ పాలిటిక్స్ పీక్ లెవెల్ వరకు చేరిందన చర్చ నడుస్తుంది. అయితే ఇంకా రిజర్వేషన్లు కూడా ఖరారు కాని స్థానంలో జరుగుతున్న ఈ రచ్చ ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా ఉందని పొలిటికల్ పండిట్స్ సెటైర్లు వేస్తున్నారు.