* ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై విస్తృత చర్చ
* క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేయాలని నాయకుల నిర్ణయం
* ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం
Astranews:
ఎపిలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఐక్యంగా... సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీయే కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. తాడేపల్లిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో ఈ సమావేశం జరిగింది. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్.. టీడీపీ తరఫున పల్లా, మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, నాయకులు-కార్యకర్తల మధ్య ఐక్యత వంటి అంశాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా చేసుకుని పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు. గ్రామ, మండల స్థాయిలలో కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు.ఎన్నికలకు ముందే జిల్లా లేదా పార్లమెంటు స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 12వ తేదీలోపు వీటి నియామకం పూర్తి చేయాలని, ఒక్కో కమిటీలో మూడు పార్టీల నుంచి ముగ్గురు చొప్పున నియమించాలని నిశ్చయించారు. తర్వాత 15వ తేదీలోపు అసెంబ్లీ స్థాయిలో సమన్వయ కమిటీలను నియమిస్తారు. వీటిలో మూడు పార్టీల నుంచి ఒక్కొక్కరిని సభ్యులుగా నియమిస్తారు.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకుని, ఐక్యంగా పనిచేయడం ద్వారా స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఆచరణలో సమన్వయం సాధ్యమేనా? ...:
సార్వత్రిక ఎన్నికల్లో త్యాగం చేశాం ఇప్పుడు తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూటమి పార్టీలు పోటాపోటీగా స్ధానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపధ్యంలో సమన్వయం సాధ్యమేనా అన్న అనుమానాలు అందరి నోటా వినిపిస్తుంది. టికెట్ అంశం మొదలైతే కానీ కూటమి పార్టీల్లో సమన్వయం ఎంత వరకు సాధ్యమవుతుందన్నది క్లారిటీ రానుంది.