Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర వైసీపీలో వారసత్వ రాజకీయం....!

28 Aug 2026
09:28 PM
139

- తెరపైకి బొత్స కుమార్తె, ధర్మాన తనయులు.. !
- అధికారం కోల్పోయిన తర్వాత కుటుంబ పట్టు నిలబెట్టుకునేందుకు సీనియర్ల వ్యూహం
- ZP చైర్మన్ పీఠంపై బొత్స కుమార్తె కన్ను
- తనయులను రంగంలోకి దింపుతున్న ధర్మాన బ్రదర్స్

Visakhapatnam :
దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన బలమైన కుటుంబాలు ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత కాలంగా అంతా తామై రాజకీయాలను నడిపిన ఆ నేతలు...ఇప్పుడు ఆ సీనియర్ నేతలు  తమ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే చర్చ సాగుతోంది. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను తమ వారసులకు రాజకీయ ఆరంగేట్రం చేసే వేదికగా మార్చుకోవాలని సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

*బొత్స కుమార్తెకు ZP చైర్మన్ పదవిపై కన్ను...:
విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబానిది చెరగని ముద్ర. బొత్స సత్యనారాయణ సతీమణి, సోదరులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. ఇప్పుడు తదుపరి తరంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  పార్టీ వర్గాల సమాచారం మేరకు, బొత్స తన కుమార్తెను రాబోయే స్థానిక ఎన్నికల్లో బరిలోకి దింపి, విజయనగరం జిల్లా పరిషత్ (ZP) చైర్మన్ పదవిని దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. తొలుత స్థానిక సంస్థల్లో గెలిచి పదవి సంపాదిస్తే, భవిష్యత్తులో అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అది బలమైన పునాది అవుతుందని ఆ కుటుంబం లెక్కలు వేస్తోంది. పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో కుటుంబ పట్టును నిలబెట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

*తనయులను తెరపైకి తెస్తున్న ధర్మాన సోదరులు....:
శ్రీకాకుళం జిల్లాలో కీలకంగా వ్యవహరించిన ధర్మాన సోదరులు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ తమ కుమారులను రాజకీయాల్లో నిలబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రసాదరావు తన కుమారుడు ధర్మాన రామ్మనోహర్ నాయుడును నియోజకవర్గ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంచుతుండగా, కృష్ణదాస్ తన కుమారుడు కృష్ణ చైతన్యను ప్రోత్సహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికలను తమ వారసులను ప్రజలకు నేరుగా పరిచయం చేసి, ఆదరణ పొందే అవకాశంగా వారు భావిస్తున్నారు. ZPTC లేదా మున్సిపల్ స్థాయి పోటీల ద్వారా వారికి ప్రాథమిక రాజకీయ అనుభవం కల్పించాలని యోచిస్తున్నారు.

మొత్తానికి ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్లు బొత్స సత్యనారాయణ, ధర్మాన సోదరులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం రాజకీయ మనుగడకు పరీక్షే కాదు, తమ తదుపరి తరాన్ని నిలబెట్టుకునే సత్తాకు కూడా పరీక్ష కానుంది. అధికార కూటమి బలం ముందు వారి ప్రభావం నిలుస్తుందా, వారసులు విజయం సాధిస్తారా అనేది ఎన్నికల తర్వాతే తేలనుంది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!