Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

'పీఓకే' పాకిస్థాన్ చేజారుతోందా .. ?

28 Aug 2026
09:09 PM
99

* పీఓకేలో పాకిస్తాన్ పట్టు ఎంతోకాలం నిలబడదు...
* అయితే అదెంత కాలం అన్నదే ప్రశ్న?
ASTRANEWS DESK : 
 ఇంతకాలంగా తమను పాకిస్థానీయులుగా భావించుకుంటూ భారతీయ హోదా ఎన్నటికీ అంగీకరించమని చెబుతూ వస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజానీకం... నేడు పాకిస్తాన్ చెర నుండి విముక్తం కావాలని ఆందోళన బాట పట్టడం ఓ గొప్ప చారిత్రక పరిణామం. గత కొంతకాలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. బియ్యం, గోధుమలు, నూనెలు, పప్పు ధాన్యాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ ధరలు భగభగమని మండిపోతున్నాయి. ఒకపక్క అధిక ధరలు, మరోపక్క నిరుద్యోగం, ఉపాధి లేమి తదితర సమస్యలతో పీఓకేలోని 45 లక్షల జనాభా సతమతమవుతున్నారు.

 భారత్ భూభాగం నుంచి ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ 'ఆజాద్ కాశ్మీర్'గా పిలుచుకుంటుంది. ఈ ప్రాంతానికి ప్రజలు ఎన్నుకునే ప్రధానమంత్రి, అధ్యక్షుడు, శాసన వ్యవస్థ, సొంత జాతీయ జెండా మొదలైనవి ఉన్నప్పటికీ పాలనాధికారాలన్నీ పాకిస్తాన్ ప్రభువుల చేతుల్లోనే ఉంటాయి. పైకి పీఓకే అనేది స్వయం ప్రతిపత్తి. కానీ పాకినిస్తాన్ చెప్పు చేతల్లోనే ఉంటూ పాక్ పాలకుల ఆదేశాలను పాటించడం మినహా సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

భారత్ ను బూచిగా చూపిస్తూ ఇన్నాళ్ళు పాక్ పాలకులు ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే అనేక ఏళ్ళుగా ఆక్రమిత పాకిస్థాన్తో అభివృద్ధి నిలిచిపోయింది. ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్కటే అక్కడ పెరిగాయి. ఆర్థికంగా మెరుగైన జీవన పరిస్థితులు లేకపోవడంతో పాటు ఇటీవల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు అక్కడి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పీఓకేను చెప్పు చేతుల్లో పెట్టుకున్న పాకిస్తాన్లో దారుణమైన ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చాలావరకు ఆదుకున్నప్పటికీ పాకిస్తాన్లో నిలకడైన ఆర్థిక పరిస్థితులు ఏర్పడలేదు. ఒకవైపు భారత్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ క్రమంగా పూర్వస్థితికి చేరుకొంటోంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. కాశ్మీరీ పండిట్లకు స్థానిక ముస్లిం ప్రజలు సాదర ఆహ్వానం పలుకుతున్నారు. పర్యాటక రంగం గణనీయంగా కోలుకుంది. జమ్మూకాశ్మీర్కు చెందిన క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడలలో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం.. అంతర్జాతీయ సమాజానికి గొప్ప సంకేతం ఇచ్చినట్లయింది. అంతర్జాతీయ పరిణామాలు.. ముఖ్యంగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, తాజగా ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికాల మధ్య సాగుతున్న భీకరపోరు కారణంగా అనేక దేశాలలో వాణిజ్యం, ఎగుమతి దిగుమతులు నిలిచిపోయి అవి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, కొద్దిపాటి ఒడిదుడుకులు మినహా 145 కోట్ల జనాభా కలిగిన భారత్ దృఢంగా, నిబ్బరంగా నిలబడగలుగుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఆహార భద్రతలో భారత్ ప్రపంచ దేశాలలో మొదటి 10 స్థానాలలో ఒకటిగా నిలబడగలిగింది.

అదుపు తప్పిన ఆందోళన... : 
* దివాళా అంచున నిలబడిన పాకిస్తాన్ గత ఏడు దశాబ్దాలకు పైగా తన నియంత్రణలో ఉంచుకున్న పీఓకేపై పట్టు కోల్పోతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఏఏసి) వంటి స్థానిక రాజకీయ పార్టీలు సంస్థలతో ఏర్పడిన ఐక్య కార్యాచరణ సమితి ప్రభుత్వ వైఫల్యాలను ముఖ్యంగా అదుపుతప్పిన ధరలు, ఆహారం, విద్యుత్తు కొరతలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి.

* ఆశ్చర్యం ఏమంటే, జేఏఏసి చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రజలు 'పీఓకే పాకిస్థాన్లో భాగం' కాదు అనే నినాదాలు చేస్తున్నారు. తమ భూభాగంలో ఇస్లామాబాద్ జోక్యం నశించాలని కోరుతున్నారు. తమ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న పాకిస్తానీ ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కుల్ని, సదుపాయాల్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

* పాక్ పాలకులు పీఓకేలో సాగుతున్న ఆందోళనను బలప్రయోగంతో అణచివేయాలని చూస్తున్నారు. అత్యంత అమానవీయంగా పాకిస్తాన్ భద్రతా దళాలు పీఓకే ప్రాంతంలో ప్రసార మాధ్యమాలను నియంత్రిస్తున్నాయి. ఇంటర్ నెట్ సౌకర్యం లేకుండా చేశాయి. పైగా, ప్రజలకు అనునిత్యం అవసరమయ్యే నిత్యావసర సరుకులు, వైద్యసామాగ్రిని సైతం నిలిపివేయడం అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. పీఓకేలోని ప్రజలను పాకిస్తాన్ తమ సొంత పౌరులుగా భావించేటట్లయితే ఆర్థిక దిగ్బంధనాలు ఎలా విధిస్తారని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఇటువంటి వైఖరి కారణంగానే తాము స్వతంత్ర పౌరులుగానో లేదా కాశ్మీరీ పౌరులుగానో గుర్తించాలని కోరుతున్నామని పీఓకేలోని మెజారిటీ ప్రజలు వాదిస్తున్నారు.

భారత్ వైఖరి ఏమిటి? ...  : 
* పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత దేశంలో అంతర్భాగమని భారత్ మొదటి నుంచి వాదిస్తూనే ఉంది. ఈ కారణంతోనే పీఓకేను పాకిస్తాన్ చిత్రపటంలో భాగంగా చూపించదు. పైగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభలో 24 అసెంబ్లీ స్థానాలను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)కు కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతంపై భారతదేశానికి ఉన్న చిరకాల రాజ్యాంగ హక్కును, శాసనహక్కును నొక్కి చెప్పేందుకే ఈ స్థానాలను ఖాళీగా ఉంచి రిజర్వ్ చేశారు. అంటే ఈ ప్రాంతం భారత్ పరిపాలనలోకి వస్తే పీఓకే ప్రాంతంలో డిలిమిటేషన్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం అధికారికంగా నిర్వహిస్తుంది. అందుకు సంబంధించి చేసిన చట్టంలో పలు నిబంధనలు చేర్చబడ్డాయి.

* పీఓకేను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునే సామర్థ్యం భారతదేశానికి లేకపోలేదు. కానీ బలవంతపు విలీనం భారత్కు ఇష్టం లేదు. ప్రత్యక్ష సైనిక దాడికి బదులుగా దౌత్యపరమైన ప్రక్రియతోను, స్థానిక ప్రజల అభీష్టం మేరకే ఈ అంశాన్ని పరిష్కరించాలని భారత్ భావిస్తోంది. జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సామాజిక అభివృద్ధి కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ చివరకు స్వచ్ఛందంగా భారత్లో విలీనం కోరవచ్చని ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ స్పష్టం చేశారు. ఆక్రమిత భూభాగంలో పౌర అశాంతి కారణంగా విలీనం చేసుకుంటే కొన్ని చిక్కు సమస్యలు ఎదురవుతాయన్న వాస్తవం భారత్కు తెలుసు. ముఖ్యంగా పీఓకే అంశం చాలా సున్నితమైనది. దీనిపై ఇప్పటికే భారత్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కు ఫిర్యాదు చేసి న్యాయం కోసం దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. అలాగే దాదాపు 45 లక్షల సంఖ్యలో ఉన్న జనాభాను నిర్వహించాలంటే, వారి పూర్తి అంగీకారం లేకుండా సజావుగా జరిగే పని కాదు.

* పీఓకేను వదులుకోవడానికి మొదటి నుంచి పాకిస్తాన్కు ఇష్టం లేదు. అనుకూలమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడి నుండి తమ మిలిటెంట్లను భారత్ భూభాగంలోకి పంపడం వారికి తేలిక కనుక ఎట్టి పరిస్థితులలో కూడా పీఓకేను వదులుకోవడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. ఈ కారణంగానే, ఒకవైపు పీఓకేలో తిరుగుబాటును సైనిక చర్య ద్వారా అణచివేస్తూ మరోవైపు ఇతర ఇస్లామిక్ దేశాల మద్దతు కోరుతోంది. అంతేకాకుండా పీఓకే భూభాగంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కు అనుసంధానమై ఉన్నందున భారత్ ఏ మాత్రం పీఓకే విషయంలో తొందరపడినా చైనా జోక్యం తప్పదని పాకిస్తాన్ నమ్ముతోంది.

* పీఓకేలో ప్రస్తుతం సాగుతున్న ఆందోళనలు పరాకాష్టకు చేరితే వాటిని నియంత్రించడం పాకిస్తాన్కు సాధ్యం కాదు. ప్రస్తుతం దేశ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు పీఓకే పెద్ద తలనొప్పిగా తయారైంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ప్రతిష్ట నానాటికీ దిరిజారి పోతోంది. పొరుగున తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గనిస్తాన్తో కూడా పాకిస్తాన్ సఖ్యంగా లేదు. బంగ్లాదేశ్లోని కొత్త ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటున్నప్పటికి పాకిస్తాన్కు అక్కడి మెజారిటీ ప్రజల మద్దతు లేదు. చైనా ఒక్కటే వివిధ స్వప్రయోజనాల రీత్యా పాకిస్తాన్కు ఆపన్న హస్తం అందిస్తోంది.

* ఇప్పటికిప్పుడు పీఓకే భారత్లో విలీనం అవుతుందని భావించలేము. పీఓకేను బలవంతంగా స్వాధీనం చేసుకొనే అవకాశం కూడా లేదు. ఒకవేళ భవిష్యత్తులో పీఓకే కనుక భారత్లో విలీనం అయితే తప్పనిసరిగా భారత్కు అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. ప్రత్యేకించి వ్యూహాత్మక, ఆర్థిక, భద్రత, ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మధ్య ఆసియా దేశాలకు భూమార్గం సుగమం కావడం, పాకిస్తాన్ నుంచి వచ్చే చొరబాటుదార్లను నిరోధించడం సాధ్యపడతాయి. ప్రధానంగా పాకిస్తాన్- చైనాల ఎకనామిక్ కారిడార్ పనులు నిలిచిపోయి పాకిస్తాన్ ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలహీనపడుతుంది.

*ప్రస్తుతం యావత్ ప్రపంచ దృష్టి ఇరాన్-అమెరికా యుద్ధంపైనే ఉండటం వల్ల పీఓకేలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ సమాజం దృష్టిని పెద్దగా ఆకర్షించడం లేదు. అయితే, ఇటీవల జెనీవాలో పీఓకే మద్దతు దారులు నిర్వహించిన భారీ ప్రదర్శనతో పీఓకేలో జరుగుతున్న మానవహక్కుల హననంపై యునైటెడ్ నేషన్స్ దృష్టి సారించింది. జమ్మూకాశ్మీర్ అంశంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు ప్రస్తుతం సానుకూల పరిస్థితులను ఏర్పరిచాయి. జమ్మూకాశ్మీర్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సంపద పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ప్రశాంత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో సహజంగానే పీఓకే ప్రజలు జమ్మూకాశ్మీర్లో అంతర్భాగం కావాలని భావిస్తున్నారు. మెజారిటీ ప్రజలు మద్దతు కోల్పోయిన తర్వాత పీఓకేలో పాకిస్తాన్ పట్టు ఎంతోకాలం నిలబడదు. అయితే అదెంత కాలం అన్నదే ప్రశ్న?.

Article Image

 

 

 

 

సి. రామచంద్రయ్య
శాసన మండలి సభ్యులు

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!