Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలు.. వైఎస్ జగన్ ...!

23 Aug 2026
03:16 PM
164

* ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే...
*  ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు...
*‘UDISE+’ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలు...
* అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారు...
* పేద, మధ్య తరగతి  పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చెయ్యడమే ...

Ys jagan : 
ఎపి పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయంటూ వైసీపీ అధినేత మాజీ సిఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాకా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరిగిందంటూ చేసిన వ్యాఖ్యల సందర్బంగా అయనకు వైఎస్ జగన్ ఎక్స్ లో పోస్టు ద్వారా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చెయ్యడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది’.

Article Image

‘నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యుడైస్‌’ ( యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ – యూడీఐఎస్‌ఈ) వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది’.

Article Image

‘అలా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం’. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి  @ncbn  ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది’.

Article Image

‘2019–24 మధ్య గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్‌ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్‌ నాటికి కొనసాగుతున్నాయి. నాడు–నేడు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది’.

‘ఎనిమిదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్‌ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్‌ సర్టిఫికేషన్‌ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ఒప్పందం చేసుకున్నాం’.

‘ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం’ ‘ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం’. అంటూ ఎక్స్ లో ట్విట్ చేశారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!