Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / సినిమా

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి ‘షావుకారు’ జానకి కన్నుమూత .. !

21 Aug 2026
03:18 PM
229

* 1950లో ఎన్టీఆర్ సరసన విడుదలైన సంచలన చిత్రం ‘షావుకారు’ ద్వారా వెండితెరకు పరిచయం...
* ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మార్చుకున్న జానకి....
* శ్వాసకోశ సంబంధ సమస్యతో బాధపడుతూ కన్నుమూత...
Sowcar Janaki : 
భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. నాలుగు తరాల ప్రేక్షకులను తన అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులను చేసిన అలనాటి ప్రముఖ సీనియర్ నటి ‘షావుకారు’ జానకి (94) తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె మరణవార్తతో తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె అసలు పేరు టేకుమళ్ల జానకి. ప్రముఖ నటి కృష్ణకుమారికి ఈమె సొంత సోదరి. చిన్నతనంలోనే నాటకరంగం పట్ల ఆసక్తి పెంచుకున్న జానకి, 11 ఏళ్ల వయసులోనే ఆకాశవాణి (రేడియో) కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందారు. 1943లో ‘రక్షా రేఖ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ, 1950లో ఎన్టీఆర్ సరసన నటించిన ‘షావుకారు’ చిత్రం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఆమె ఇంటిపేరుగా 'షావుకారు' జానకిగా సినీ చరిత్రలో స్థిరపడిపోయారు.  తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా చేసింది. దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె అసాధారణ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 400లకు పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఆమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఆమె సత్యసాయిబాబా భక్తురాలు.

Article Image

కేవలం నాయికగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనూ వైవిధ్యం చాటుకుని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కళారంగానికి ఆమె అందించిన అమూల్యమైన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!