* ఇదేనా కూటమి పాలన ?
* ఘటనను వీడియో తీసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ప్రజలను బెదిరించడం దారుణం ..
* నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?
* వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ ..
తాడేపల్లి :
గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే రాష్ట్రంలో వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు . ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద ఇద్దరు ఎస్‌ఐలు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టడం, కారు నుంచి గంజాయి, మద్యం బాటిళ్లు, పోలీసు యూనిఫాం లభించాయన్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. ఘటనను వీడియో తీసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ప్రజలను బెదిరించడం మరింత దారుణం. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా? అంటూ మండిపడుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
వైయస్ జగన్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో....
హే రామ్…!
గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి ? చంద్రబాబు గారూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది.
ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, “వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం” అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?
ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా?
చంద్రబాబుగారూ… రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి.
ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్‌బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి.