* సిఎం చంద్రబాబు, అరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు..
* సిపిఐ రాష్ర్ట కార్యదర్శి ఈశ్వరయ్య లేఖ...
విజయవాడ :
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపుదల, తదితర సమస్యల పరిష్కారానికై తక్షణ చర్యలు తీసుకుని వెంటనే సమ్మె విరమింప చేయ్యాలని సిఎం చంద్రబాబు, అరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు సిపిఐ రాష్ర్ట కార్యదర్శి ఈశ్వరయ్య రాసిన లేఖలో కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందిచకపోవడంతో సోమవారం నుండి అత్యవసర సేవలను బహిష్కరిస్తామంటూ చూసిన ప్రకటన రోగుల్లో ఆందోళన రేపుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) తమ డిమాండ్ల సాధనకోసం ఆగస్టు 12 నుంచి నాన్-ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. ఉపకార వేతనం (స్టైఫండ్) పెంపుదలపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో జూడాల ఆందోళన ఉధృతమైంది. ద్రవ్యోల్బణం, పెరిగిన పనిభారం దృష్ట్యా జివో నెం. 287 ప్రకారం స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 3%, ఇంటర్న్‌లకు 5% గా ప్రతిపాదించిన వార్షిక పెంపును జూడాలు వ్యతిరేకిస్తున్నారు. చర్చలు విఫలం కావడంతో వారు అత్యవసర సేవల మినహా ఇతర సేవలను నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. ఆగస్టు 15 నాటికి స్పష్టమైన హామీ రాకపోతే ఆగస్టు 17 నుంచి ఆందోళనలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు జూడాలు ప్రకటించారు.
మన పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోలిస్తే ఏపీలో జూనియర్ డాక్టర్లకు ఇస్తున్న స్టైపెండ్ చాలా తక్కువగా ఉంది. స్టైఫండ్ పెంపుదలతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, రక్షణ చర్యలు, మెరుగైన పని వాతావరణం కల్పించాలని జూడాలు కోరుతున్నారు. అతి భారీ పని గంటలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇతోధికంగా వైద్య సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్ల శ్రమను, ఒత్తిడిని గుర్తించి తగిన విధంగా వారికి స్టైఫండ్ పెంచాలి.
జూడాలు గత 5 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందిచకపోవడంతో సోమవారం నుండి అత్యవసర సేవలను బహిష్కరిస్తామంటూ ప్రకటించారు. జూనియర్ డాక్టర్లు చేసిన ప్రకటనతో రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ వైద్యరంగం ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రమాదం దాపురించింది. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపి, వారి సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.

ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.