* ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ..
* మీరు సభలో మాట్లాడండి.. నేను అధారాలతో ప్రెస్ మీట్లు పెడతా...
* రాకుంటే జీతాలు కట్ అన్న స్పీకర్ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చెయ్యని వైసీపీ ...
తాడేపల్లి :
ఈ నెల 17వ తేది నుంచి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. కానీ శాసనమండలికి మాత్రం హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ (YSRCP) నిర్ణయించింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది.
తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా నిరాకరించినందున, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించారు. శాసనమండలిలో ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి సమావేశాలకు హాజరవుతారని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై వైఎస్ జగన్... సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా వస్తుంది. ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. అందువల్ల అసెంబ్లీలో మనం చేయగలిగింది లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో నేను ప్రెస్మీట్లు పెడతాను. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణేనికి రెండోవైపు చూపిస్తాం. కానీ, మండలిలో మనకు బలం ఉంది.. ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలి అంటూ స్పష్టం చేశారు.
కానీ ప్రతి అసెంబ్లీ సమావేశాలకు ముందు వైసీపీ ప్రత్యేకంగా భేటి అవుతున్నా... ఈ సారి మాత్రం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీకి రాకపోతే జీతం కట్ చేస్తామని సంచలన ప్రతిపాదన నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం కట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరికల నేపధ్యంలో వైసీపీ వెనకడుగు వెయ్యలేదు. దీంతో సమావేశాలకు హజరు కానీ వారి పట్ల స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తాడోనన్నది చర్చనీయాంశంగా మారింది.