Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు గారూ..! పోలవరం కుడి కాలువ రైతులకు వెంటనే విద్యుత్‌ పునరుద్ధరించండి....

28 Jul 2026
05:58 PM
159

* సగం ఖరీఫ్‌ పూర్తయ్యాక విద్యుత్‌ నిలిపివేయడం తీవ్ర అన్యాయం...
* మెట్ట భూములకు నీటి ఎత్తిపోతలపై శాశ్వత విధానం రూపొందించాలి....
* మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో లేఖ..!

గన్నవరం   :

పోలవరం కుడి ప్రధాన కాలువపై వ్యవసాయ పంపుసెట్లకు హఠాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో వేలాది రైతు కుటుంబాల జీవనోపాధితో పాటు ఖరీఫ్‌ పంటలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పంపుసెట్లు, విద్యుత్‌ సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబును తీవ్రంగా అవమానించిన ఆరోపణలు ఎదుర్కొన్న గన్నవరం అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కేసుల్లో అరెస్ట్ కావడం...తీవ్ర అనారోగ్యం పాలవ్వడం...అనంతరం జైల్లో నుంచి విడుదలయ్యాక తిరిగి ఇటీవలే యాక్టివ్ అయ్యారు. యాక్టీవైన వంశీ ఇటీవల సీఎం చంద్రబాబుకు వరుస లేఖలు రాస్తున్నారు. 

ఇప్పుడు కొత్తగా పోలవరం కుడి కాల్వ ద్వారా గన్నవరం నియోజకవర్గంలో డెల్టా ఆయకట్టు రైతులతో పాటుగా మెట్ట ప్రాంత రైతులకు కూడా నీరందించి ఆదుకునేలా సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ వల్లభనేని వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా గత 11 సంవత్సరాలుగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తున్నారని, దీనివల్లా కృష్ణా డెల్టా ఆయకట్టుకు భరోసా ఏర్పడిందని తెలిపారు. తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ జలాలు రైతాంగానికి ఆపద్బాంధవిగా మారాయన్నారు.

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించే క్రమంలో, కృష్ణా డెల్టాతో పాటు పోలవరం కుడి కాల్వ సమీపంలో ఉన్న మెట్ట ప్రాంత గ్రామాలకు సైతం నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని 2015లో తాను గన్నవరం ఎమ్మెల్యేగా ఉంటూ విజ్ఞప్తి చేయగా, పోలవరం కుడి కాల్వ నిర్మాణానికి పెద్ద మనసుతో భూములిచ్చి సహకరించారంటూ మానవతా దృక్పథంతో మీరు అంగీకరించారని చంద్రబాబుకు తెలిపారు. దీంతో తన స్వంత ఖర్చులతో బాపులపాడు మండలంలో 13 చోట్ల, గన్నవరం మండలంలో 15 చోట్ల, ఉంగుటూరు మండలంలో 3 చోట్ల, విజయవాడ గ్రామీణ మండలంలో 5 చోట్ల దాదాపు 500కు పైగా విద్యుత్తు మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సాగునీరు అందించేందుకు, తాగు నీటి సమస్య తలెత్తకుండా చెరువులు నింపేందుకు కార్యాచరణ చేపట్టినట్లు గుర్తుచేశారు.

దీని వల్ల గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్ల కాలంలో 9 ఏళ్లు నిరాటంకంగా పట్టిసీమ నీటిని నియోజకవర్గంలోని డెల్టా, మెట్ట ప్రాంతాలకు అందించగలిగానన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, విద్యుత్తు, విజిలెన్స్ శాఖల అధికారులు అప్పట్లో పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించడాన్ని వ్యతిరేకించారన్నారు. మోటార్లకు విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేశారన్నారు. ఈ విషయాన్ని తాను వెంటనే చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, సానుకూలంగా స్పందించి నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటిని వాడుకునే అవకాశం కల్పించారన్నారు.

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ నాటి ముఖ్యమంత్రి జగన్ దీనిని కొనసాగించారన్నారు. కానీ ఈ ఏడాది మాత్రం పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించే అవకాశం లేకుండా నీటిపారుదల అధికారులు , పోలీసులు బందోబస్తుతో ఎక్కడికక్కడ మోటార్లను నిలిపివేయిస్తున్నారని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న మెట్ట ప్రాంత రైతులకు పట్టిసీమ నీరు ఆగిపోవడం మరింత ఆందోళనకరంగా మారిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో పట్టిసీమ నీటిని వాడుకునే విధంగా సత్వరమే తగు చర్యలు తీసుకునేలా నీటిపారుదల అధికారులను ఆదేశించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మరి ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా...మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిని రేపుతొంది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!