* పేపర్ లీకేజీ నేరాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా, గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష...
* నిబంధనలు ఉల్లంఘించిన సర్వీస్ ప్రొవైడర్లపై 8 ఏళ్ల నిషేధం, రూ.5 కోట్ల వరకు జరిమానా..
* కేసుల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి ..
* ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో రోజువారీ విచారణ నిర్వహించి మూడు నెలల్లో తీర్పు...
Delhi :
పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026’ సోమవారం (జులై 27, 2026) రోజున లోక్‌సభ ముందుకు రానుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 కు సవరణలు చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.
పేపర్ లీకేజీలు, పరీక్షల్లో భారీ అక్రమాలకు పాల్పడే ముఠాలకు కనీసం 7 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే ₹10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు.
ఈ అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్ష, మరియు ₹50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు లేదా కంపెనీలు తప్పు చేసినట్లు తేలితే, వాటిపై ₹5 కోట్ల జరిమానాతో పాటు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా 8 ఏళ్ల పాటు నిషేధం విధిస్తారు. అలాగే సదరు సంస్థల డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్‌కు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.
వేగవంతమైన విచారణ :
పోలీసులైనా ... ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థలైనా కేసు నమోదు అయిన రెండు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. చార్జ్‌షీట్ దాఖలు చేసిన మూడు నెలల లోపే రోజువారీ విచారణ జరిపి తీర్పు వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైతే ఈ కేసుల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ను ఏర్పాటు చేసేలా ఈ బిల్లు ద్వారా అధికారం కల్పించనున్నారు.