Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఇక నారా లోకేష్ వంతు...!

25 Jul 2026
07:17 PM
516

○ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో...
○ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలంటూ ఎపీలో డిమాండ్...
○ లేనిపక్షంలో ఎపీ యువత ఆగ్రహానికి బలి కాక తప్పదని వైసీపీ హెచ్చరిక....
 ○ 28 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు....
ASTRANEWS DESK   :
ఢిల్లీ వంతు పూర్తయింది. ఇక ఏపీ వంతు  మొదలైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం...చిలికి చిలికి గాలివానగా మారి...కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. ఇందుకు ప్రముఖ సామాజిక, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ అమరణ దీక్ష , క్రాకోచ్ పార్టీ నిరసనలు దేశ వ్యాప్తంగా విస్తరించడం....దేశ రాజధానిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మంత్రి రాజీనామా చెయ్యక తప్పని పరిస్దితి. 

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎపిలోను డిఎస్సీ అక్రమాలు వెలుగుచూసిన నేపధ్యంలో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న మంత్రి నారా లోకేష్ రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. ఏపీలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా @naralokesh రాజీనామా చేయాలి.. లేనిపక్షంలో ఆంధ్ర రాష్ట్ర యువత ఆగ్రహానికి బలి కాక తప్పదంటూ వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా అప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. అది కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఈ డిమాండ్ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

ఎపి డిఎస్సీ అక్రమాల వ్యవహారంపై ప్రతి నిత్యం ఎవరి నోటో ఒకరి నోట విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 'మెగా డీఎస్సీ'  నియామకాల చుట్టూ జరుగుతున్న రాజకీయ పోరు గత కొంత కాలంగా తీవ్ర స్థాయికి చేరింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఈ అంశాన్ని సీరియస్ గానే తీసుకుంది. పేపర్ లీకులు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. అయితే, ఈ రాజకీయ దాడిని అధికార తెలుగుదేశం పార్టీ  కూటమి ప్రభుత్వం ఇస్తున్న వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది. ప్రత్యేకించి స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టుల భర్తీలో నిబంధనలు ఉల్లంఘించారని, జీవోలను మార్చడం ద్వారా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నవారికి లబ్ధి చేకూర్చారని మాజీ మంత్రి పేర్ని నాని వంటి సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం రాని నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతోనే ఈ పేపర్ లీక్, అక్రమాల అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తుందని  భావిస్తున్నారు.
అత్యంత గోప్యంగా ఉండాల్సిన డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్‌ పనులను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి అప్పగించి అక్రమాలకు తెర తీశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 16వేల టీచర్‌ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా ధ్వంసం చేశారని విమర్శించారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా డీఎస్సీ అక్రమాలను బయటపెట్టినా, ఈ ప్రభుత్వం వాటిని తేలిగ్గా తీసుకుందని... యువతలో సహనం నశిస్తే ఏం జరుగుతుందో గతంలో బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనల్లో కనిపించిందని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

అంతేకాకుండా వైసీపీ ఇప్పుడు  ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో డిఎస్సీ అంశాన్ని లేవనెత్తుతూ డీఎస్సీలో జరిగిన తప్పులపై సీబీఐ దర్యాప్తు వేయాలని వైసీపీ కోరింది. వైసీపీ పార్లమెంట్ (YSRCP పార్లమెంట్) వేదికగా పోరాటానికి దిగింది. మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో(CBI)విచారణ జరిపించాలని కోరుతూ లోక్‌సభ(లోక్‌సభ), రాజ్యసభ (రాజ్యసభ) ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వగా, లోక్‌సభలో పార్టీ ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై వాయిదా తీర్మానం చేశారు.

దీంతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు డిమాండ్ తో పార్టీ విద్యార్ధి, యువజన విభాగాలు సంయుక్తంగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్ధులు, యువతతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తామని, ప్రభుత్వం కళ్లుతెరిచేలా స్పందిస్తామని చెబుతోంది.

ఢిల్లీలో జరిగిన నిరసనలు ఇప్పుడు ఎపీలో మరోమారు గుర్తుచేస్తున్నాయి. అయితే ఢిల్లీలో యువత పెద్ద ఎత్తున మద్దతుగా తరలిరావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. మరి రాష్ట్రంలో వైసిపికి ఆ పార్టీ అనుబంధ సంఘాలే కాకుండా...ఇతర విద్యార్థి యువజన సంఘాలు... మిగిలిన ప్రతిపక్షాలు ఎంతవరకు కలిసొస్తాయో.... ఈ ఉద్యమ సెగ కూటమి కి ఏ స్దాయిలో తగలనుందో వేచి చూడాలి. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!