ASTRANEWS DESK :
అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ కు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఆదివారం వైఎస్సార్సపీ కాపు నేతల ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విశాఖ, తిరుపతిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. నేటి సమావేశం తమ బాధలు పంచుకోవడానికి, ఒకరికి ఒకడు అండగా ఉండేందుకినని చెప్పారు.
"ఎక్కడ సమస్య వస్తే నాయకులమంతా అక్కడికి వెళ్తాం. చట్టానికి మేం వ్యతిరేకం కాదు. మేమంతా చట్టాన్ని గౌరవిస్తాం. రాజకీయాల్లో రివేంజ్ నిర్ణయాలు పనికిరావు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే హక్కుల్ని కోరుతున్నాం. కావులకు 3.000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఒక కోటీ రూపాయలు కూడా ఇవ్వలేదు. గతంలో కాపునేస్తం ఇచ్చాం.. ప్రజల అవసరాలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు సహకారం అందించాలి. ఉన్న వాటిని తీసేస్తే ఊరుకునేది లేదు.
రానున్న రెండు మూడేళ్లలో కాపు జాతికి గౌరవం పెరిగేటట్టు ప్రయత్నించాలి. ఇది పార్టీలకు పరిమితం కాదు. రాజకీయ పార్టీలో గౌరవం కోరుకుంటాం. కూటమి పార్టీలో కాపులకు అది దక్కటం లేదు. కులంలో ఉన్న వారంతా విద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు అని మాట్లాడటం సరికాదు... ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదు. ముద్రగడ కూడా సమావేశానికి హాజరు రావాల్సి ఉంది. ఆరోగ్యం బాగాలేక పోలేదు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని తీర్మానంగా రూపొందించాం.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరు ముందుకు వచ్చినా అందరూ కలిసి అక్కడ వెళ్లి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కడు 50 వేల రూపాయలు చొప్పున వేసుకుని సాయి కృష్ణ కుటుంబానికి అందించాలి. రాజకీయం కాదు ఒక కుటుంబానికి అందించే సాయం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటి వరకు చంపిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఇదే వేరే కులంలో జరిగితే ఊరుకుంటాడా. ఈ సమావేశం కాపు నాయకులందరికీ ఒక సందేశం ఇస్తుంది. మేము మీకు అండగా ఉంటాము అని కాపులందరికి భరోసా కల్పిస్తుంది" అని బొత్స తెలిపారు.