* సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం ...
* అమరావతి కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు ..
* ప్రభుత్వం నుంచి రాయలసీమ రైతుకు భరోసా లేదు ...
తాడేపల్లి :
గ్రేటర్ రాయలసీమ ప్రజల నీటి అవసరాలను గుర్తించి ఇప్పటికైనా రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిందేనని వైయస్ఆర్‌సీపీ రాయలసీమ నాయకులు డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిప్టుపై పార్టీ రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ కన్వీనర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కందుల నాగార్జునరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఆ వివరాలు వెల్లడిస్తూ ...
సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం :
చంద్రబాబు సీమ ప్రాజెక్టులపై మొదటి నుంచి నిర్లక్ష్యమే. రాయలసీమ లిఫ్టు ఒక రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు ప్రశ్నార్థకం చేస్తున్నారు. చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి కారణంగా పక్కనే ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ, కృష్ణా నీటిని తరలించుకుపోతున్నారు.
గడిచిన రెండేళ్లుగా ప్రజలకు ఏది అవసరమో వాటిని పక్కన పెట్టి, తనకు ఏది లాభమో ఆ పనులు మాత్రమే చేస్తూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడు. మాయమాటలతో చంద్రబాబు గ్రేటర్ రాయలసీమ ప్రజలను వంచనకు గురి చేస్తున్నాడు. ఎగువ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని గగ్గోలు పెడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల ద్వారా రోజూ 7 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కర్నాటకలో అప్పర్ భద్ర, ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తయితే కనీసం 130 టీఎంసీల నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాయలసీమ నీటి ఇబ్బందులకు పరిష్కారం చూపినట్టవుతుందని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.1000 కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని, కాబట్టి మిగిలిన పనులు పూర్తి చేయాలని గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాల్లో మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి వివరించడం జరిగింది. కానీ, జగన్ గారికి మంచి పేరొస్తుందనే కుట్రతో రెండేళ్లు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టేశాడు. 90 శాతం పనులు పూర్తి చేసుకుని మరో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే అందుబాటులోకి వచ్చే రాయలసీమ ఎత్తిపోతల గురించి ఆలోచన చేయకుండా బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గాల్లో లెక్కలు చెప్పి కాలయాపన చేస్తూనే ఉన్నాడు. ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై చంద్రబాబు చిన్నచూపు చూపిస్తున్నాడు.
అమరావతి కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు :
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నాడు. రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్లు అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అమరావతిలో ఒక్కో చదరపు అడుగు నిర్మాణం కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాడు. ఇదే అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు కేవలం రూ. 5 వేలు మాత్రమే. చదరపు అడుగుకు నాలుగు రెట్లు అదనంగా చేస్తున్న ఖర్చు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇంత భారీ స్థాయి అవినీతికి ఆస్కారం లేకుండా వైయస్ జగన్ గారు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ ప్రకారం ముందుకెళితే చంద్రబాబు చేస్తున్న ఖర్చులో కేవలం 20వ వంతు ఖర్చుతో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వానికి ఏమంత కష్టం కాదు. గ్రేటర్ రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలనే డిమాండ్ తో ముందుకెళ్లాలని వైయస్ఆర్‌సీపీ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాజెక్టులను సందర్శించడం జరుగుతుంది. మొదటి విడతలో అనంతపురం, నెల్లూరులోని ప్రాజెక్టులను సందర్శిచడం జరుగుతుంది.
ప్రభుత్వం నుంచి రాయలసీమ రైతుకు భరోసా లేదు :
రాయలసీమ రైతులకు చంద్రబాబు నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదు.హార్టీ కల్చర్ హబ్‌గా ఉన్న రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. నీళ్లు లేక చీనీ తోటలు ఎండిపోతున్నాయి. అనంతపురంలో వేరుశెనగ పండించే రైతులు తగ్గిపోయారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభలో వైయస్ జగన్ గారిని తిట్టడమే సరిపోయింది తప్పితే, రెండేళ్లలో ఏం సాధించారో చెప్పుకోలేకపోయారు. దుబారా ఖర్చులను తగ్గించాలని పిలుపునిస్తూ ఆర్భాటపు సభలతో, వైయస్ జగన్ గారిని దూషించడానికి పదుల కోట్లు ఖర్చు చేయడం అవసరమా?.
సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపానపోలేదు. రెండేళ్ల తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి పంగనామాలు పెట్టేశారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ కూడా సరిగా నిర్వహించలేకపోయారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రుజువైంది. కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి స్పందన లేదు. విశాఖ భూములను 99 పైసలకు బినామీలకు కట్టేబెట్టేశారు. ఇప్పుడు పీపీపీ పేరుతో ఆర్టీసీ భూములను కాజేసే కుట్రలు చేస్తున్నారు. రెండేళ్ల పాలనంతా ఎల్లో మీడియా ప్రకటనల్లో తప్ప పనితనం కనిపించలేదు. కనీసం ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఓటేసిన ప్రజల నమ్మకానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ధ్వజమెత్తారు.