HYDERABAD :
ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేసి, కేంద్రాన్ని రద్దు చేస్తే..తాను కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటూ బీజేపీ విసిరిన సవాల్‌కు ఆయన ఈ విధంగా ప్రతి సవాల్‌తో కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత కోరారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీలపై మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హామీలు నెరవేర్చకపోయినా ఎవరూ ప్రశ్నించడం లేదని అన్నారు. తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కిషన్‌రెడ్డికి సవాల్ విసురుతూ.. హామీలు అమలు కాకపోతే మోదీ రాజీనామా చేస్తే, తాను కూడా తన కేబినెట్‌ను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి ప్రజా తీర్పు, స్పష్టమైన మెజారిటీ ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మద్దతుతో నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న బీజేపీకి, పూర్తి మెజారిటీ ఉన్న తనను రాజీనామా చేయమని డిమాండ్ చేసే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
రాజకీయ సవాళ్లు ఎప్పుడూ ఏకపక్షంగా ఉండకూడదని, అన్ని పార్టీలకు సమానంగా వర్తించాలని హితవు పలికారు. కాబట్టి మొదట ప్రధాని మోడీ రాజీనామా చేయాలని, ఆ తర్వాతే తనను అడగాలని రేవంత్ రెడ్డి సూచించారు.