• వైసీపీ నేతలు అధికార పార్టీ వ్యూహానికి చిక్కారా ?
• అధికార పార్టీ వ్యూహం నిత్యానందరెడ్డేనా..?
• టార్గెట్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్ఢా...?
• కడప జిల్లా రాజకీయాలను కుదుపు కుదిపేస్తున్న దస్తగిరి హత్య...
ASTRA DESK :
కడపలోని రిమ్స్ ఆవరణలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంటొంది. హత్య అనంతరం పోలీసులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కేసులో కీలకమంటూ ...అతని టార్గెట్ గా గడచిన కొన్ని రోజులుగా విచారణను ముమ్మరం చెయ్యడం ...ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ రేపుతొంది. దీంతో నిత్యానందరెడ్డికి హత్యతో ప్రమేయం ఉందా అన్న అనుమానాలు ఎలా ఉన్నా.... అధికార పార్టీ నేతల వ్యూహంలో చిక్కారా ? అన్న అనుమానాలు మాత్రం ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక వేళ అధికార పార్టీ వ్యూహంలో చిక్కినట్లయితే.... టార్గెట్ నిత్యానందరెడ్డేనా...? లేక నిత్యానందరెడ్ఢి బుజంపై గన్ పెట్టి మరొకరిపై గురి ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కడప రిమ్స్ లో దస్తగిరి హత్య ... :
ఈ నెల 6వ తేదీన నగర శివారుల్లోని అలంఖాన్‌పల్లెలో గొడవ జరిగిన తరువాత చికిత్స నిమిత్తం దస్తగిరి, గాయపడిన కుటుంబ సభ్యులు రిమ్స్ కు వెళ్లారు. పరీక్షలు చేసిన రిఫోర్ట్స్ తీసుకుని చికిత్స చేస్తున్న వార్డుకు వెళ్తున్న దస్తగిరిని ఆవరణలో కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేపింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని దస్తగిరి పోలీసులకు కోరినట్లు, కానీ ఎవరూ స్పందించకపోవడం వల్లే హత్య కు దాలితీసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కారణంగానే అలంఖాన్ పల్లెలో ఘర్షణ, అనంతర పరిణామాలపై అప్రమత్తత పాటించలేకఫోయారన్న ఆరోపణలతో కడప తాలుకా సిఐ, కడప డిఎస్పీలపై బదిలీ వేటు వేశారు. కానీ అక్కడ నుంచే కేసు మలుపు తిరిగిందన్న ప్రచారం జరుగుతుంది.
దస్తగిరికి - నిత్యానందరెడ్ఢికి ఏంటీ సంబంధం :
హత్యకు గురైన దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఇద్దరు వైసీపీ జిల్లా అధ్యక్షులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్ఢికి ముఖ్య అనుచరులు. దస్తగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటం వల్ల రవీంద్రనాథరెడ్డి స్థలాల వ్యవహారాలు చూస్తుండే వాడు. నిత్యానందరెడ్డి మొదటి నుంచి రవీంద్రనాథరెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. దస్తగిరితోను మంచి సంబంధాలే ఉండేవి. కానీ ఇప్పుడు దస్తగిరిని హత్య చేసిన వారిలో కొంతమంది సైతం చాలా కాలంగా నిత్యానందరెడ్డి అనుచరులుగా ఉంటూ ఆయనతో కలిసి పలు వ్యాపారాలు చేసినట్లు తెలుస్తొంది. కానీ హత్య తరువాత నిందితుల్లో కొంత మంది నిత్యానందరెడ్డిని కలిశారన్నది పోలీసు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ కారణంగానే నిత్యానందరెఢ్డి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అయనను 13వ నిందితుడిగా పోలీసులు చేర్చి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
కేసు మలుపు - ప్రత్యర్దుల వ్యూహం .. :
గతంలో ఎన్నడూ లేని విధంగా కడప రిమ్స్ లో దస్తగిరి హత్య జరిగింది. ఈ హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఇందులో ప్రధాన సూత్రధారిగా కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి మీడియా ముందుకు రాకుండానే జడ్జి ఎదుట హజరుపరిచారు. జడ్జీ సైతం వారికి రిమాండ్ విధించారు. కానీ కేసులో మాజీ డిప్యూటి మేయర్ నిత్యానందరెడ్ఢిని 13వ నిందితుడు చేర్చారు. దీంతో ఆయన ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఇంతటితో కేసు ముగిసే పరిస్థితి కనిపించడం లేదు.
దస్తగిరి ఇంట్లో రూ.100 కోట్ల అస్తులా...కేసు మలుపు కు ఇవే అస్త్రలా .. ? :
హతుడు పెద్ద దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తుల ఒరిజినల్ సేల్ డీడ్లు, క్రయ, విక్రయ పత్రాలు లభ్యమైనట్లు, వాటినే రెవెన్యూ, పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ పత్రాల్లో మాజీ ప్రజాప్రతినిధి భార్య, కుమారుడి పేరుతో రాసిన సేల్డీడ్లు, ఇతరత్రా గుర్తించినట్టు పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ మాజీ ప్రజాప్రతినిధి వైఎస్ జగన్ మేనమామ వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ రెడ్ఢే అని అనధికారికంగా ప్రభుత్వ యంత్రాంగం ఓ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు హత్య కేసును సిట్ కు అప్పగించాలని సీఎం చంద్రబాబును కోరుతానని టీడీపీ సీనియర్ నాయకుడు జోనల్ కన్వీనర్ ఆర్. శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేశారు. దీన్నిబట్టి చూస్తే పెద్ద దస్తగిరి హత్య కేసు వ్యవహారం చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది.
గురి ఎవరి వైపు... :
హత్య కేసులో 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన అనంతరం డిప్యూటి మేయర్ నిత్యానందరెడ్డి వైపు పోలీసుల చూపు మల్లింది. హతుడు పెద్దదస్తగిరి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో వైసీపీ నేతలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 145 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలు ఉండగా, ఈ భూముల మొత్తం విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి నివాసంలో రెండు రోజుల క్రితం రాత్రి నాలుగు గంటల పాటు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు చేపట్టిన విచారణతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. అందువల్లే పోలీసులు అయనను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ డిప్యూటి మేయర్ నిత్యానందరెడ్డి పట్టుబడితే కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇఅందులో భాగంగానే నిత్యానందరెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి సోదాలు చేసిన పోలీసు అధికారులు నిత్యానందరెడ్డి సహాయకుడు రాజ్ కుమార్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు సమాచారం. నిత్యానందరెడ్డి రూ.5 లక్షలు నగదు ఇస్తే ఆ మొత్తం కేసులో ఉన్న నరేంద్రకు అప్పగించానని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తూ రింగ్ రోడ్డులోకి తీసుకొని కోటింగ్ ఇచ్చినట్లు సమాచారం. రాజ్ కుమార్ కేవలం ఇంటి పనులు, వ్యక్తిగత పనులకే పరిమితమైన తనకు ఇవేవి తెలియవన్నందుకు పోలీసులు లాఠిలకు పనిచెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టే పోలీసుల విచారణ ఎలా సాగుతుందో తెలుసుకొవచ్చు.
ఇప్పుడు నిత్యానందరెడ్డిని కేసులో సంబంధం ఉన్నట్లు నిరుపించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు నిత్యానందరెడ్డి దొరికితే ...పోలీసులు విచారించడం...కేసు మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తొంది. త్వరలో జరగనున్న కడప నగరపాలక సంస్థ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీని ఇబ్బందుల పాలు చేసేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతొంది. అటు ఇటు తిరిగి కేసు వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి మెడకు చూట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగమని కూడా చర్చ నడుస్తొంది.
కానీ వాస్తవానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేయడంలో ఆరితేరిన నేతగా గుర్తింపు పొందారు. అలాగే కింద స్థాయి నుంచి డిప్యూటి మేయర్ స్థాయికి ఎదిగిన నిత్యానందరెడ్ఢి అలాంటి నాయకుడిగానే ఎదిగారు. కానీ హత్య రాజకీయాల వైపు ఏనాడు మొగ్గుచూపింది లేదన్నది జిల్లా వాసుల అభిప్రాయం. అలాంటిది ఇప్పుడు హత్య రాజకీయాలకు తెరలేపడం అనేది అధికార పార్టీ వ్యూహంగానే కనిపిస్తొందన్న వాదన బలంగా వినిపిస్తొంది.
దస్తగిరి హత్యతో నా భర్తకు సంబంధం లేదు - నిత్యానందరెడ్డి సతీమణి బండి దీప్తి... :
ఈ కేసుపై మొదట్లో తేలిగ్గా తీసుకున్నారో ఎమో గానీ వైసీపీ నాయకులెవరూ నోరు తెరవ లేదు. కానీ మంగళవారం మాజీ డిప్యూటి మేయర్ నిత్యానందరెడ్డి సతీమణి బండి దీప్తీ మీడియా ముందుకు వచ్చారు. పెద్ద దస్తగిరి హత్యకేసుతో నా భర్తకు ఎటువంటి సంబంధం లేదని, నిత్యానంద రెడ్డి పైన వస్తున్న నిందలు కేవలం ఆరోపణలు మాత్రమేనని, పెద్ద దస్తగిరి కి నా భర్తకు ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం మాపై కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
నిత్యానంద రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, ఆయన వైవాహిక జీవితంలో ప్రతిదీ నాకు తెలుసన్నారు. పెద్ద దస్తగిరి ఇంటిలో ఉన్న డాక్యుమెంట్స్ తో నా భర్తకు ఎటువంటి సంబంధం లేదని, నాకు తెలియకుండా ఆయనకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవన్నారు.
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా కూటమి ప్రభుత్వం పెద్ద దస్తగిరి హత్య కేసు నా భర్తపై మోపుతోందని, పత్రికలన్నీ నా భర్త పైన కక్ష్య పూరిత కథనాలు కూడా రాస్తున్నారని ఆవేదన చెందారు.
ఇది పొలిటికల్ కేసుగా చూడకుండా ఒక కామన్ మేన్ గా కేసుగా డీల్ చేయాలని పోలీసులను వేడుకుంటున్నట్లు తెలిపారు.
దస్తగిరి హత్య వ్యక్తిగత సమస్య... రాజకీయాలకు సంబంధం లేదు.. రవీంద్రనాథరెడ్డి.... :
కడపలో జరిగిన హత్య వ్యక్తిగత సమస్య అని,దానిలో రాజకీయాలకు సంబంధం లేదన్నారు.
కానీ రెండు రోజుల నుంచి దాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టారని, చనిపోయిన దస్తగిరి వైఎస్సార్సీపీ అభిమాని అని మంచివాడన్నారు. మా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కి, దస్తగిరి కి ఎటువంటి వైషమ్యాలు లేవని, చనిపోయిన పెద్ద దస్తగిరి రాబోయే ఎన్నికల్లో బీసీకి రిజర్వ్ అయితే అతనే అభ్యర్ధి. దీన్ని జగన్ గారికి అంటించే కార్యక్రమం చేస్తున్నారని, ఇప్పటికీ పెద్ద దస్తగిరి నీ చంపిన వాళ్లకు కటినంగా శిక్ష పడాల్సిందేనని కోరుకుంటున్నాము. జగన్ కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని,
ఫ్యాక్షన్ ప్రాంతాన పులివెందులలో వర్గాల మధ్య రాజీ చేసి అభివృద్ధి బాట పట్టించారన్నారు. రాజారెడ్డి హత్య ఎవరు చేసారో తెలిసినా వారీని ఇబ్బంది పెట్టలేదని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. జగన్ నిజాయితీ వల్లే నేను మున్సిపల్ చైర్మన్ అయ్యానని చెప్పాడం జరిగిందని, బీటెక్ రవి కూడా జగన్ అనుకుంటే నేను నిలవలేను అని చెప్పిన మాటలు గుర్తు చేశారు.
అటువంటి మంచి వ్యక్తి జగన్ కు ఇలాంటి రాజకీయాలు పులుముతారా..? అని ప్రశ్నించారు.