• నిర్ద్వంద్వంగా తిరస్కరించిన పోప్ లియో...
• అధ్యక్షుడికి విధేయుడిగా... పోప్ పట్ల గౌరవాన్ని ప్రదర్శించిన జేడి వాన్స్ .... !
రోమ్ :
ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాదించేందుకు తనకు ఏమాత్రం ఆసక్తి లేదని క్యాథలిక్కుల మతపెద్ద పోప్ లియో-14 నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అమెరికా-ఇరాన్ యుద్ధం వేళ ఇరువురి మధ్య విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకోగా... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బహిరంగ చర్చకు రావాలన్న ప్రతిపాదనను పోప్ లియో తిరస్కరించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
దైవ సందేశాన్ని బోధించడమనే తన కర్తవ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి అంగోలాకు విమానంలో వెళ్తూ మీడియాతో ఆయన మాట్లాడారు. తన బోధనలు ట్రంప్‌ను ప్రత్యక్షంగా ఉద్దేశించినవి కావని, విస్తృత శాంతి సందేశంలో అవి ఒక భాగమని వివరించారు. తన పర్యటన మొదటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఏర్పడిన రాజకీయ వాతావరణం కారణంగా.. తనపై వ్యతిరేక ప్రచారం జరిగిందన్నారు. అందులోని కొన్ని అంశాలు నిజాలు కావని చెప్పారు.
నేను రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి : పోప్ లియో
ప్రస్తుతం ఆఫ్రికా పర్యటనలో ఉన్న పోప్ లియో XIV, జర్నలిస్టులతో మాట్లాడుతూ తన వైఖరిని స్పష్టం చేశారు. "నేను రాజకీయ నాయకుడిని కాదు. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలో పాల్గొనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం నియంతల చేతిలో నాశనమవుతోందని తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ను ఉద్దేశించినవి కావని, ఆ ప్రసంగం అంతకుముందే సిద్ధమైందని ఆయన వివరించారు. తన మాటలను ట్రంప్ విమర్శలకు ముడిపెట్టడం ఏమాత్రం సరైంది కాదని పోప్ అసహనం వ్యక్తం చేశారు.
అధ్యక్షుడికి విధేయుడిగా... పోప్ పట్ల గౌరవాన్ని ప్రదర్శించిన జేడి వాన్స్ ...
అమెరిక ఉపాధ్యక్షుడు వాన్స్ ఈ వివాదాన్ని చాలా చాకచక్యంగా విశ్లేషించారు. "పోప్ బాధ్యత సువార్తను బోధించడం, నైతిక సమస్యలను ఎత్తిచూపడం. ఆ సూత్రాలను పాలనలో వర్తింపజేయడం ఒక నాయకుడిగా అధ్యక్షుడి బాధ్యత" అని ఆయన వివరించారు. ఒకవైపు అధ్యక్షుడికి విధేయుడిగా ఉంటూనే, మరోవైపు పోప్ పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.