Delhi :
లోక్‌సభలో నిన్న రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, దానితో పాటే ఉన్న మరో రెండు అనుబంధ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. కానీ ఇదంతా ఓ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించే మోదీ-షా ద్వయం, ఈ బిల్లును నెగ్గించుకోవాలనుకుంటే తమ కూటమిలోని పార్టీలే కాకుండా తటస్థ పార్టీలను లేదా విపక్షాల మద్దతును కచ్చితంగా కూడగట్టేవారు. ఇంతకుముందు అలానే చేశారు. కానీ, అమిత్ షా కేవలం కూటమి పక్షాల బలంతో పాటు ఇతర పార్టీలు మద్దతు తెలపాలంటూ చుట్టపుచూపు పిలుపులతోనే బలప్రదర్శనకు వెళ్లడం వెనుక ప్రత్యేకమైన రాజకీయం ఉన్నట్లు తెలుస్తొంది. మోదీ-షా రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాయన్నది అందరు ఎరిగిందే.
మోదీ, షా రాజకీయ వ్యూహాంలో భాగమేనా ...? :
భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా జంట వేసే ప్రతి పాచిక వెనుక ఒక బలమైన రాజకీయ లక్ష్యం ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం చర్చనీయాంశమైన రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలోనూ అదే కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ సవరణ వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు, అది నెగ్గడానికి అవసరమైన లెక్కలపై ముందే కసరత్తు చేస్తుంది. కానీ, ఈసారి మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతు కోరడానికి కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం, కేవలం కూటమి పార్టీలపైనే ఆధారపడటం వెనుక ఒక లోతైన వ్యూహం దాగి ఉందని చెప్పక తప్పదు. ఈ బిల్లు నెగ్గడం కంటే, వీగిపోతేనే బీజేపీకి రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. విపక్షాలను మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేయడం... బిల్లు వీగిపోతే మహిళాభివృద్ధికి తాము తెచ్చిన విప్లవాత్మక మార్పును విపక్షాలు అడ్డుకున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నది మోదీ ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనపడుతొంది. మేము మహిళల కోసం మార్పు కోరుకున్నామని, కానీ విపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకున్నాయనే సెంటిమెంట్‌ను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా విపక్షాలను మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేయాలన్నది ప్రస్తుత లక్ష్యంగా కనపడుతొంది. బిల్లు నెగ్గితే దాని క్రెడిట్ కేవలం ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ, అది వీగిపోతే ఆ కోపం అంతా విపక్షాల మీదకు మళ్లుతుందని, ఈ లాజిక్ కాంగ్రెస్ మిస్సయిందన్నది ఎన్డేయే కూటమి ఉద్దేశ్యం.
సంఖ్యాబలం కూడగట్టకుండానే సాహసమా ?... :
పార్లమెంటులో అవసరమైన మెజారిటీ లేదని తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం ద్వారా తాము తమ ఎజెండాకు కట్టుబడి ఉన్నామని, రాజీపడే ప్రసక్తే లేదని తమ కేడర్‌కు బీజేపీ ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది. ఈ ఓటమి ద్వారా వచ్చే సానుభూతిని.... ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవడమే మోదీ-షా ద్వయం ముందున్న అసలు లక్ష్యంగా కనపడుతుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఒక చట్టం కావాలనే ఆకాంక్ష కంటే, విపక్షాల అసలు రంగును బయటపెట్టే ఒక పొలిటికల్ ట్రాప్ లాగా మారింది. ఇదే మోదీ-షా నెక్స్ట్ లెవల్ రాజకీయం అనుకోవచ్చు.