Modi to Address Nation :
12 ఏళ్లుగా తిరుగులేకుండా ఉన్న మోదీకి శుక్రవారం బిగ్‌షాక్ తగిలింది. లోక్‌సభలో పెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ విషయంపై ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
డీలిమిటేషన్ చేయాలనే ఉద్దేశంతో 131 రాజ్యాంగ సవరణ కోసం తీసుకొచ్చిన బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. బిల్లు వీగిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మోదీ ఏం మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది. ప్రతిపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎన్డీఏ దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టనుంది. ఆ విషయంలో ప్రజలకు కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉంది.
గడచిన పన్నెండేళ్లుగా తిరుగులేని మెజారిటీతో బిల్లులను ఆమోదింపజేసుకుంటున్న మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తొలిసారిగా లోక్‌సభలో చుక్కెదురైంది. డీలిమిటేషన్ కోసం ప్రవేశ పెట్టిన 131 సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు కావాల్సిన 352 ఓట్లు రాకపోవడం ఈ పరిస్థితికి కారణం.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ దానిని అమలు చేసే విధానంపైనే అసలు గొడవ. కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచడం ద్వారా ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా మహిళలకు అవకాశం కల్పించవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వాదించినా... రిజర్వేషన్‌లను పునర్విభజనతో ముడిపెట్టడం మహిళలను మోసం చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే వెంటనే 33 శాతం కోటా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పునర్విభజన అనేది సాకు మాత్రమేనని దేశ రాజకీయ పటాన్ని మార్చేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన స్థానాలను పెంచితే జనాభా ఎక్కువా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఇదే జరిగితే కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసినట్టు అవుతుందని తెలంగాణ, తమిళనాడు సీఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్‌లలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉప కోటా ఉన్నప్పటికీ ఇతర వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలు పూర్తి అయ్యే వరకు ప్రక్రియ ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బిల్లు వీగిపోవడాన్ని బీజేపీ బ్లాక్ డే గా అభివర్ణించింది. ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకులని వారి అహంకారం వల్ల కోట్లాది మంది మహిళల ఆశలు అడియాశలయ్యాయని ప్రధాని మండిపడ్డారు. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రభుత్వం కుట్రను ప్రతిపక్షాల ఐక్యత అడ్డుకుందని ఆమె అన్నారు.
ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న టైంలో మోదీ స్టేట్మెంట్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రధానంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు.