Sunday, 10 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

చట్ట సవరణ బిల్లు వీగడానికి కారణం ఎవరు.. ?

18 Apr 2026
01:00 AM
41


DELHI   :

లోక్‌సభ వేదికగా జరిగిన పరిణామాలు.... రాజకీయాలు గెలిచి...మహిళా సాధికారతకు గ్రహణం పట్టేలా చేశాయి. గత దశాబ్ద కాలంగా తిరుగులేని మెజారిటీతో దూసుకుపోతున్న కేంద్రం... రాజకీయ గురి ఒకదానిపై పెట్టి మరోకదానిపై గురి పెట్టినట్లు నటించడంతో చివరకు  అనూహ్యంగా విపక్షాల ఐక్యత రూపంలో ఒక భారీ అడ్డంకి ఎదురైంది.
ఫలితంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, దానికి అనుబంధంగా ఉన్న మరో రెండు కీలక బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వెనుక ఉన్న రాజకీయ, సామాజిక కోణం కొత్త సమీకరణాలకు దారితీసింది.

Article Image
సంఖ్యా పరంగా సరే..సాంకేతికంగా ఎన్డీయేకు  తప్పని ఓటమి ..  :
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్‌లో అధిక సంఖ్యలో సభ్యులు మద్దతు పలికారు. లోక్ సభలో ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొనగా.. 298 మంది అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. కానీ  సాధారణ బిల్లు అయితే ఇది సులువుగా నెగ్గేది. అయితే రాజ్యాంగ సవరణ కావడంతో దీనికి ‘ప్రత్యేక మెజారిటీ’ (హాజరైన వారిలో 2/3 వంతు) రావలసిన అవసరం ఉంది. ఈ సాంకేతిక పరిమితి వద్దే ప్రభుత్వం బొక్కబోర్ల  పడింది. ఫలితంగా అవసరమైన ఓట్లు రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. ఇది ప్రభుత్వానికి సంఖ్యాపరమైన ఓటమి మాత్రమే కాదు, వ్యూహాత్మక వైఫల్యం కూడా అని చెప్పక తప్పదు.

మహిళా రిజర్వేషన్ పేరుతో గట్టెక్కాలనుకుంటే.... డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది సెగ..  :
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం ‘డీలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం. మహిళా కోటా అమలు కావాలంటే లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుండి 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. జనాభా ప్రాతిపదికన ఈ మార్పులు చేస్తే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు భారీగా ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయం విపక్షాల్లో పెరిగింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ ‘ఇండియా’ కూటమి ఏకమై గళమెత్తింది. ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందన్న వాదనతో దక్షిణాది ఎంపీలను విపక్షాలు ఏకం చేయడంలో సఫలమయ్యాయి. దీంతో మహిళా రిజర్వేషన్ పేరుతో గట్టెక్కాలనుకుంటే....డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది సెగ ధాటికి సవరణ బిల్లే వీగిపోయేలా చేసింది.

ఉహించని పరిణణామంతో కేంద్రం వెనక్కడుగు ..  :
ప్రధానమైన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో, దానిపై ఆధారపడిన డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) చట్ట సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ ప్రకటన చేయడం ఎన్డీఏ శిబిరంలో నిశ్శబ్దాన్ని, విపక్షాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. విపక్షాల అభ్యంతరాలను ముందుగానే అంచనా వేసి, వారిని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని పక్షాలను ఒప్పించి కేంద్రం ముందుకు వెళ్లింటే పరిస్థితి మరోలా ఉండేది. తమకు నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోక... మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దత్తు తెలపాలంటూ మొండిగా ముందుకెళ్లడంతో చివరకు బిల్లులన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

Article Image 

మహిళా సాధికారతకు చిత్తశుద్ది ఏదీ..?
పార్లమెంట్ లో జరిగిన పరిణామం మహిళా లోకానికి ఒక తీరని నిరాశనే చెప్పవచ్చు. ఒకవైపు మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే, విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం టెక్నికల్ అంశాలను తెరపైకి తెచ్చాయని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు.. ఓబీసీ కోటా లేకుండా, దక్షిణాది ప్రయోజనాలను పణంగా పెట్టి బిల్లును ఆమోదించలేమని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఇద్దరి పోరులో దశాబ్దాలుగా నానుతున్న మహిళా రిజర్వేషన్ల స్వప్నం మరోసారి పార్లమెంటు రికార్డుల్లో బందీ అయ్యింది. పార్లమెంటులో ఈరోజు జరిగిన ఉదంతం భారత ప్రజాస్వామ్యంలో ఆచరణ, చిత్తశుద్దిని ప్రశ్నించేలా చేశాయి. ప్రభుత్వం ఎంత బలంగా ఉన్నా, రాజ్యాంగ పరమైన మార్పులు చేసేటప్పుడు విపక్షాలను కలుపుకుపోవడం అత్యవసరమని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఇది ఎన్డీఏకు ఒక గట్టి హెచ్చరిక అయితే.. విపక్షాలకు తమ ఐక్యతను చాటుకునే అవకాశం కలిసోచ్చినట్లయ్యింది.  ఏది ఏమైనా, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూనే మహిళా హక్కులను రక్షించే ఒక సమతుల్య మార్గం కోసం దేశం ఇంకా ఎదురుచూస్తూనే ఉండాల్సిన పరిస్థితి. 

ఇప్పుడు ఇక రాజకీయ ఆరాటం కోసం పోరాటం :

అధికార పక్షం తప్పిదాలు.... విపక్షాల భయాందోళనలు వెరసి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దానిపై ఆధారపడిన డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) చట్ట సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే అంతకు ముందు జరిగిన చర్చలో తామంతా మహిళ సాధికారతకు కట్టుబడి ఉన్నామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆచరణలో పరిస్థితుల మరోలా మారాయి. కానీ పార్లమెంట్ లో జరిగిన పరిణామాలను క్యాచ్ చేసుకునేందుకు ఇప్పుడు రాజకీయ ఆరాటం కోసం....ఒకరిపై ఒకరు బురదజల్లుకునేందుకు పోటీపడటం ఖాయం. అసలే ఇప్పుడు ఆయా రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న
నేపధ్యంలో ఇది మరింత తీవ్ర స్దాయిలో ఉండే అవకాశం లేకపోలేదు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!