Strait of Hormuz open :
క్రూడ్ ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచానికి ఇరాన్ శుభవార్త చెప్పింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘీ ట్వీట్ చేశారు. లెబనాన్తో ఇజ్రాయెల్ సీజ్ఫర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీజ్ఫైర్ అమలులో ఉన్నంత కాలం (మరో 9 రోజులు) జలసంధి తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ మేరకు
ఇరాన్ తన పట్టు సడలిస్తూ హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ వాణిజ్యం కోసం పూర్తిగా తెరిచింది. సీజ్ ఫైర్ కాలంలో ఆయిల్ ట్యాంకర్లకు ఎటువంటి అడ్డంకులు ఉండవని ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నిర్ణయం ముడి చమురు ధరలు తగ్గడానికి దోహదపడటమే కాకుండా, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఒక సానుకూల సంకేతంగా నిలుస్తోంది.
ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ అనూహ్య నిర్ణయం గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించింది. ఇది కేవలం ఒక మార్గం తెరవడం మాత్రమే కాదు, భారీగా పెరుగుతున్న ముడి చమురు ధరలకు బ్రేక్ వేసే పరిణామం. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్లకు అడ్డంకులు తొలగడంతో భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటే కానుంది.
ఇరాన్ సైన్యం ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడంతో గత కొన్ని రోజులుగా సముద్ర రవాణా అస్తవ్యస్తమైంది. షిప్పింగ్ కంపెనీలు భయంతో రూటు మార్చుకోవడమో లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెంచడమో చేశాయి. అయితే, తాజా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని గౌరవిస్తూ, సముద్ర మార్గంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది. "ప్రాంతీయ శాంతిని కాపాడటంతో పాటు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎటువంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఇరాన్ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.
ఈ పరిణామంతో హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ మళ్లీ గాడిన పడుతుంది. ఇది క్రూడాయిల్ ధరలు పెరగకుండా అడ్డుకోవడమే కాకుండా, రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రపంచంలో సరఫరా అయ్యే క్రూడాయిల్‌లో 20 శాతం ఈ సన్నని జలసంధి ద్వారానే వెళ్లాలి. ఇక్కడ ఏ చిన్న అలజడి జరిగినా దాని ప్రభావం సామాన్యుడి పెట్రోల్ బిల్లుపై పడుతుంది.
అయితే, ఇరాన్ ఈ ప్రకటనను కేవలం 'సీజ్ ఫైర్' సమయానికే పరిమితం చేయడం అంటే, ఇది శాశ్వత పరిష్కారం కాదని, కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని అర్థమవుతోంది. పశ్చిమ దేశాలతో చర్చల విషయంలో పైచేయి సాధించడానికి ఇరాన్ ఈ మార్గాన్ని ఒక 'వ్యూహాత్మక ఆయుధం'గా వాడుతోంది. ఏది ఏమైనా, ప్రస్తుతానికి గల్ఫ్ తీరంలో తుపాకులు శాంతించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అందించినట్లయింది.