Sunday, 10 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

అమెరికాకు మరో ఎదురు దెబ్బ ...!

06 Apr 2026
01:01 PM
21

* రెస్క్యూ విమానాన్ని కూల్చేసిన ఇరాన్‌..ఐదుగురు మృతి
* దిగిరాకుంటే నరకమే : ట్రంప్‌ అల్టిమేటం
* పట్టించుకోని టెహ్రాన్‌
* గల్ఫ్‌పై కొనసాగుతున్న దాడులు

Astra central desk : 

ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా దళాలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ఎఫ్‌-15ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చేయడం, దానిలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు ప్రకటించారు. పైలట్‌ను రక్షించామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్‌ మీడియా ఓ వార్తను అందిం చింది. దాని ప్రకారం…కూలిపోయిన యుద్ధ విమానానికి చెందిన పైలట్‌ కోసం గాలింపు జరుపుతున్న అమెరికా రెస్క్యూ విమానం సీ-130ని ఇస్ఫహాన్‌ దక్షిణ ప్రాంతంలో ఐఆర్‌జీసీ ధ్వంసం చేసింది. ఖతార్‌ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. గాలింపు చర్యలు చేపట్టిన విమానాలకు రీఫ్యూయలింగ్‌ చేయడానికి సీ-130 వచ్చింది. అయితే అందులోని సిబ్బంది ఏమైందీ తెలియలేదు. గాలింపు సమయంలో ఇరాన్‌ దళాలు అనేక అమెరికా విమానాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా ఇరాన్‌ దళాలు జరిపిన దాడులలో ఐదుగురు చనిపోయారు. కూల్చివేతకు గురైన వాటిలో సీ-130 విమానంతో పాటు రెండు బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.

పైలట్‌ను రక్షించాం : ట్రంప్‌
ఇరాన్‌లో చిక్కుపోయిన రెండో పైలట్‌ను రక్షించామని, ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతనిని గుర్తించారని, ప్రస్తుతం అతను అమెరికా బలగాల రక్షణలో ఉన్నాడని తెలిపారు. పైలట్‌ను తీసుకొని రావడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఆయుధాలతో అనేక విమానాలను పంపామన్నారు. పైలట్‌ గాయపడినప్పటికీ కోలుకుంటున్నాడని చెప్పారు.

ఇరాన్‌ సీనియర్‌ అధికారులను చంపేశాం .. అమెరికా ...
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై జరిపిన దాడులలో ఆ దేశానికి చెందిన పలువురు సీనియర్‌ సైనికాధికారులు చనిపోయారని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు. దాడికి సంబంధించి ఒక నిమిషం ఏడు సెకన్ల నిడివి కలిగిన వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. అందులో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆకాశంలో దట్టమైన పొగలు అలము కున్నాయి. అయితే ఈ దాడులు ఎప్పుడు జరిగిందీ ట్రంప్‌ వెల్లడించలేదు. తమతో ఒప్పందం చేసుకొని, హర్మూజ్‌ జలసంధిని తెరవని పక్షంలో నరకాన్ని చవిచూడాల్సి ఉంటుందంటూ హెచ్చరిక జారీ చేసిన తర్వాత ట్రంప్‌ ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. ఇరాన్‌ కూడా ఈ దాడులపై ఇంతవరకూ స్పందించలేదు. ఇదిలావుండగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ కమాండర్‌ ఖస్సెమ్‌ సోలైమని బంధువుగా గుర్తించిన ఓ మహిళ శాశ్వత నివాస హోదాను అమెరికా రద్దు చేసింది. సొలైమని బంధువు హమిదెహ్‌ సొలైమని అప్షర్‌ను, ఆమె కుమార్తెను ఇమ్మిగేషన్‌ అధికారులు నిర్బంధించారని, వారిని దేశం నుంచి బయటికి పంపే ప్రయత్నం జరుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు.

కువైట్‌ చమురు సెక్టార్‌ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ దాడి  :
గల్ఫ్‌లోని కువైట్‌పై ఇరాన్‌ ఆదివారం విరుచుకు పడింది. షువైఖ్‌ చమురు సెక్టార్‌ ప్రాంగణంపై డ్రోన్‌ దాడి జరిపింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ కాంప్లెక్స్‌లో చమురు మంత్రిత్వ శాఖ కార్యాలయం, కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. దాడిలో ఆస్తినష్టం గణనీయంగానే జరిగిందని తెలుస్తోంది. విద్యుత్‌-డీశాలినేషన్‌ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ డ్రోన్లను ప్రయోగించగా రెండు విద్యుదుత్పత్తి యూనిట్లలో కార్యకలాపాలు నిలిచి పోయాయి. ఇరాన్‌ వైపు నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు సమర్ధవంతంగా అడ్డుకున్నాయని కువైట్‌ తెలిపింది. ఈ కారణంగా భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని చెప్పింది. కువైట్‌లోని ఓ ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్‌ దాడి జరిగిందని తెలుస్తోంది. కాగా ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే క్రమంలో శకలాలు భూమిపై పడి అబూధాబీలోని బోరగ్‌ పెట్రోకెమికల్‌ ప్లాంటులో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నేపథ్యంలో ప్లాంటులో కార్యకలాపాలను వెంటనే నిలిపివేశారు. అటు యూఏఈలోని అల్యూమినియం పరిశ్రమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌ దాడులు జరిపింది.

నరక ద్వారాలు మీ కోసమే తెరిచి ఉన్నాయి : ఇరాన్‌ హెచ్చరిక ...
తమతో ఒప్పందానికి రావాలని, హర్మూజ్‌ జలసంధిని తెరవాలని, లేకుంటే నరకం చూస్తారని ట్రంప్‌ జారీ చేసిన హెచ్చరికలను ఇరాన్‌ బేఖాతరు చేసింది. ట్రంప్‌ జారీ చేసిన అల్టిమేటంను తోసిపుచ్చింది. అది నిస్సహాయతతో, భయాందోళనలతో జారీ చేసిన హెచ్చరిక అని ఎద్దేవా చేసింది. ‘అందులో పొంతన లేదు. ఆయనది తెలివితక్కువ చర్య. మేము ఇస్తున్న సందేశం యొక్క అర్థమేమిటంటే నరక ద్వారాలు మీ కోసం తెరిచి ఉంటాయి’ అని ఖతం అల్‌-అన్బియా కేంద్ర కార్యాలయానికి చెందిన జనరల్‌ అలీ అబ్దోల్లహీ అలియాబది హెచ్చరించారు.

అణు స్థావరాలపై దాడులను ఖండించండి : ఐరాసను కోరిన ఇరాన్‌ ...
తమ అణు స్థావరాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ దళాలు జరుపుతున్న దాడులను ఖండించాల్సిందిగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ను కోరారు. ఈ మేరకు గుటెర్రెస్‌కు రాసిన లేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇరాన్‌లో పనిచేస్తున్న ఏకైక అణు విద్యుత్‌ ప్లాంటుపై పదే పదే జరుగుతున్న దాడులు మధ్యప్రాచ్యంలో మానవ, పర్యావరణ ప్రమాదాలకు దారితీస్తాయని అరాగ్చీ హెచ్చరించారు. బుషెహర్‌ స్థావరంపై జరుగుతున్న దాడులను సహించలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. రేడియో ధార్మిక పదార్థాలు కలుషితమైతే ఇరాన్‌ సరిహద్దులకు ఆవల కూడా తీవ్ర పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. బుషెహర్‌ ప్లాంటుపై నాలుగు సార్లు దాడి జరిగిందని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ ద్వారా ఆయన తెలియజేశారు. రేడియో ధార్మిక పదార్థాలు విడుదలైన పక్షంలో టెహ్రాన్‌ కంటే గల్ఫ్‌ సహకార మండలి సభ్య దేశాలకే ముప్పు ఎక్కువ అని చెప్పారు.

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!