* జగన్ కట్టించిన ఇళ్లను ఇప్పుడు పంచారు ...
* మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్
* నాయుడుపేట సభలో చంద్రబాబు అబద్ధాలు
* ఇళ్ల పంపిణీపై చంద్రబాబుచెప్పినవన్నీ అబద్దాలే ..
* మేం 31.19 లక్షల ఇళ్ల స్ధలాలిచ్చాం... 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేశాం...
* అందులో 9 లక్షల ఇళ్లు పూర్తి చేసిచ్చాం.. నిరూపించేందుకు ఎక్కడైనా సిద్దం..
నెల్లూరు :
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెర లేపారని, ఇవాళ (సోమవారం) నాయుడుపేట సభలో ఆయన చెప్పిన అబద్దాలే అందుకు నిదర్శనమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో ఇళ్ల పంపిణీ పేరుతో పేదలపై భారం మోపిన చరిత్ర చంద్రబాబుది అయితే, వారికి రూ.12 వేల కోట్ల రాయితీలు కల్పించి ఇళ్లను నిర్మించి ఇచ్చిన చరిత్ర జగన్‌గారిదని కాకాణి గుర్తు చేశారు. అయినా ఆయనపై సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు వల్లె వేస్తున్నారని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు.
చంద్రబాబు పాలనను ఈసడించుకుంటున్న జనం.... :
ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్ధితుల్లో లేరు. చంద్రబాబు పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారు. నాయుడుపేటలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించక పోవడమే ఇందుకు నిదర్శనం. సభ జరుగుతుండగానే జనం బయటికి వెళ్లిపోయారు. చంద్రబాబు పాలనకు ప్రజలు ఎలా స్పందిస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తోంది. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం ఎప్పుడూ బయటికి రాదు. ఆయనకు ఏమీ పని లేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక బొంకుల బాబు అవతారం ఎత్తి లేని పోని విమర్శలు చేస్తుంటారు. ఎవరు చేసిన మంచి పని అయినా తన ఖాతాలో వేసుకోవడం, తప్పు జరిగితే అధికారులు, ఇతరులు, ప్రతిపక్షాల మీద నెట్టేయడం చంద్రబాబుకు అలవాటే. చంద్రబాబు ముఖారవిందాన్ని, స్టేజ్ ను తప్ప జనాన్ని ఎక్కడా లైవ్ లో చూపించకుండా జాగ్రత్త పడ్డారు.
నాయుడుపేట సభలో చంద్రబాబు మళ్లీ అబద్దాలు... :
2029 కల్లా ప్రతీ పేద వాడికీ ఇల్లు కట్టించడమే లక్ష్యమని, తిరుపతి జిల్లాలో 15659 ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకూ రాష్ట్రంలో 5.5 లక్షల ఇళ్లు నిర్మించామని చంద్రబాబు చెప్పుకున్నారు. 2014–19 మధ్య సీఎంగా ఉండగా ఎన్ని స్థలాలు ఇచ్చావు? ఎన్ని ఇళ్లు కట్టించారో ఆయన చెప్పగలరా? ఈ 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు కట్టించామని మరో పచ్చి అబద్ధం చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారా? పనులు చేశారా? ఉంటే చెప్పండి. గతంలో మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాక పంపిణీ చేయకుండా ఆగిపోయిన వాటినిఇవాళ లబ్దిదారులకు పంపిణీ చేయడం నిజం.
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 6.55 లక్షల ఇళ్లు కట్టారని చంద్రబాబే ఇవాళ చెప్పారు. అర్బన్ లో నిధులన్నీ వాడేశారని, రూ.815 కోట్లు అప్పు పెట్టారని, మంచి ఇళ్లు కడితే వాటిని నాశనం చేశారని అదే నోటితో నిస్సిగ్గుగా అబద్ధాలు కూడా చెప్పారు. ఇళ్లే కట్టకుండా, పూర్తి చేయకుండా మంచి ఇళ్లు కడితే నాశనం చేశారని ఎలా చెప్తారు? అసలు చంద్రబాబు తన జీవితంలో ఏదైనా మంచి పని చేశారా ?, పది మందికి ఉపయోగపడే పని చేశారా చెప్పాలి.
వైసీపీ హయాంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ... :
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయి. మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని నిరూపించేందుకు మేం సిద్దం. అదే చంద్రబాబు అప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎక్కడా నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చింది కానీ, ఇళ్లు కట్టించి ఇచ్చింది కానీ లేదు. చివరకు అమరావతి భూముల్లో కుంభకోణాలు చేసి రైతుల్ని మోసం చేద్దాం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయించి డబ్బులు దండుకుందామనే ఆలోచన చంద్రబాబుది. 2019–24 మధ్య నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర వైయస్ జగన్ మోహన్ రెడ్డిది. దాదాపు రూ.32 వేల కోట్ల విలువైన 72 వేల ఎకరాల భూముల్ని పేదలకు పంచి పెట్టిన చరిత్ర వైయస్ జగన్ మోహన్ రెడ్డిది. ఇప్పటికైనా వాటిని చూస్తాం అంటే చూపించేందుకు మేం సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు వచ్చినా, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినా నెల్లూరు జిల్లాలో మేం పంచిన భూములు, ఇళ్లు చూపించేందుకు సిద్దం. మేం మొక్కుబడిగా సెంటు స్థలం చూపించలేదు. వాగుల్లో, వంకల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాదు చంద్రబాబే. అమరావతిలో రైతులకు అలాంటి స్థలాలు ఇచ్చింది చంద్రబాబే. మేం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టించడంతో పాటు మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాం. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పేరుతో పథకం చేపట్టి ఇంటికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు, ప్రతి ఇంటికి రూ.35 వేలు వడ్డీ లేని రుణం ఇప్పించాం. కంపెనీలతో మాట్లాడి సిమెంట్, స్టీల్ ను సరసమైన ధరలకు ఇప్పించాం. లబ్దిదారులకు అన్ని విధాలా అండగా నిలిచి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మేం ఇళ్లు ఇస్తే.. ఇవాళ చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెప్పుకుంటున్నారు.
టిడ్కో ఇళ్లు ఇచ్చిందీ వైయస్ జగన్ మోహన్ రెడ్డే :
2024 ఫిబ్రవరి లో అంటే ఎన్నికల ముందు నాటికి లక్షా 25 వేల టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చాం. వాటికి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి ఇచ్చాం. 300 చదరవు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) టిడ్కో ఇంటిని కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన చరిత్ర జగన్‌గారిది. అలా 1,43,600 ఇళ్లను అక్కచెల్లెళ్లకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీన్ని చంద్రబాబు కాదని చెప్పగలరా?. ఇంకా 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి, లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ ఇచ్చాం. 365 ఎస్‌ఎఫ్‌టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44, 304 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.25 వేల చెల్లింపుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఇంకా 430 ఎస్‌ఎఫ్‌టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 74,312 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.50 వేల చెల్లింపుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారు చెల్లించాల్సిన రూ.482.32 కోట్ల భారాన్ని నాడు మా ప్రభుత్వం భరించింది.
టిడ్కో ఇళ్లలో చంద్రబాబు అవినీతి .. :
చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగింది అవినీతి మాత్రమే, అభివృద్ధి కాదు. చంద్రబాబు 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లకు రూ.2.6 లక్షల చొప్పున ధర నిర్ణయించి, బ్యాంకుల్లో లోన్లు ఇప్పించి, 20 ఏళ్లలో రూ.7.2 లక్షల రూపాయల భారం వేశారు. మేం అలా చేయలేదే ? ఆయనకు ఎక్కువ ముడుపులు ఇచ్చిన వాళ్లకు ఎక్కువ ధరలు ఇచ్చి, తక్కువ ముడుపులు ఇచ్చిన వారికి తక్కువ మొత్తాలు ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చారు. ఇలా టిడ్కో ఇళ్ల మీద రూ.8,929 కోట్లు అవినీతికి పాల్పడిన విషయం వాస్తవమా కాదా చంద్రబాబు చెప్పాలి.
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు .. :
ఎన్నికలకు ముందు నాకు అనుభవం ఉంది, సంపద పెంచుతానని చెప్పి ఇవాళ ఇంధనం లేకపోతే బండి నడవదని చంద్రబాబు చెప్తున్నారు. ఆ రోజు ఇంధనం లేకపోతే బండి నడవదని తెలియదా? ప్రజలకు ఖర్చు చేయడానికి ఇంధనం లేదు కానీ చంద్రబాబు, ఆయన కొడుకు కోసం ఖర్చు చేయడానికి మాత్రం అన్నీ ఉన్నాయి. ఇంకా హిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసింది జగన్‌గారు కాదు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా ఓటుకు కోట్లు కేసులో వీడియో, ఆడియో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయి వచ్చింది ఎవరో అందరికీ తెలుసు. తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలతో కోట్లాది భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంది చంద్రబాబే. మీరు చెప్పిన అబద్ధాలకు సమాధానం చెప్పలేక, సిగ్గుతో క్షమాపణలు చెప్పుకోలేక తిరిగి మా మీద విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి లడ్డూ నెయ్యిలో కొవ్వులు కలిశాయని అబద్ధాలు చెప్పి, సీబీఐ సిట్ రిపోర్ట్‌లో దొరికిపోయిన చరిత్ర చంద్రబాబుది. స్కిల్ స్కాంలో భాగస్వామ్యం ఉంది కాబట్టే, సంతకాలు పెట్టారు కాబట్టే చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్ ఇచ్చింది. అంబటి రాంబాబు, మిథున్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేశ్.. ఇలా మా నేతల మీద మీరు పెట్టించినవే దొంగ కేసులు. ఏమాత్రం ఆధారాలు లేకపోయినా ఈ దొంగ కేసులు పెట్టారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక ఎక్కడ, ఏ మాత్రం నియంత్రించగలిగారు? చివరకు సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికిపోతే ఏం సమాధానం చెప్పగలిగారని కాకాణి గోవర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.