* వైసీపీ ఆద్వర్యంలో `మన మూలపేటకు పోదాం` కార్యక్రమానికి కదం తొక్కిన ఉత్తరాంధ్ర ప్రజలు, వైసీపీ శ్రేణులు ...
* వైయస్.జగన్ హయాంలో 70% పూర్తయిన మూలపేట పోర్టు పనులు
* రెండేళ్లైనా పనులు పూర్తి చేయని చంద్రబాబు ప్రభుత్వం
* వైసీపీ అభివృద్దిని..కూటమి తీరును ఎండగట్టిన వైసీపీ...
* ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బాబాయి - అబ్బాయి..
* జిల్లా అభివృద్ది పట్టని అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు..
* పనులు చేయకపోయినా క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు..
* ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు భారీగా పోలీసుల మోహరింపు..
శ్రీకాకుళం : రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న మూలపేట పోర్టు పనులను కూటమి ప్రభుత్వం అడ్డుకోవడంతో వైసీపీ చేపట్టిన ఉద్యమబాటలో సక్సెసైంది. ఈ మేరకు సోమవారం వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ‘మన మూలపేటకు పోదాం’ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రజలు, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కదం తొక్కి పోర్టు వద్దకు తరలివచ్చారు. ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి తమ నిరసనను తెలియజేశాయి.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి, సుమారు 70 శాతం పనులు పూర్తి చేసిన మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ 'చలో మూలపేట' పేరిట భారీ ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా నౌపాడులో జరిగిన భారీ బహిరంగ సభలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వైయస్ఆర్‌సీపీ అగ్రనేతలు, మాజీ మంత్రులు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సంతబొమ్మాళి మండలం మూలపేట తీరంలో సుమారు రూ.4,361.91 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్‌లో మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు ఖర్చు చేశారు. టెక్కలి జాతీయ రహదారి నుంచి పోర్టు వరకు రోడ్డు కోసం 327.75 ఎకరాలు, రైల్వే మార్గం కోసం 100.71 ఎకరాలు సేకరించారు.

వైసీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి.. :
వైసీపీ ప్రభుత్వం హయాంలోనే పోర్టు పనుల్లో సుమారు 70 శాతం పూర్తి అయ్యాయి. అయితే తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వంలో మిగిలిన పనులు నిలిచిపోయాయి. క్రెడిట్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మళ్లీ భూములు అవసరమంటూ అధికారుల ప్రకటనలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కూటమి తీరును నిరసిస్తూ వైసీపీ మన మూలపేటకు పోదాం కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
పోర్టు కలను వైయస్ జగన్ నిజం చేశారు : మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్....
దశాబ్దాలుగా ఉన్న మూలపేట పోర్టు కలను వైయస్ జగన్ నిజం చేశారు. భావనపాడు పోర్టు పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసారు. ఈ పోర్టుతో చదువుకున్న యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మూలపేట పోర్టుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రాజెక్టులు ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తాయి. వైయస్.జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1800 ఎకరాలతో (రైతుల త్యాగం 362 ఎకరాలు, అటవీ భూమి 1100 ఎకరాలు) సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు కుంటుపడ్డాయని, కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
వైయస్ జగన్ మూలపేట పోర్టును దూరదృష్టితో నిర్మించారు - శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ..
వైయస్ జగన్ మూలపేట పోర్టును దూరదృష్టితో నిర్మించారు. కానీ కూటమి ప్రభుత్వం పోర్టును, ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికే ఇక్కడ సభ ఏర్పాటు చేశాము. రాంమోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు. బోగాపురం ఎయిర్ పోర్టు అనేది వైఎస్ జగన్ గారి కృషి కాదా? GMR ను అడిగితే ఎయిర్పోర్ట్ ఎవరి హయంలో వచ్చిందో చెప్తారు. కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం వైఎస్ జగన్ గారు చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయాడా ? వైఎస్ జగన్ గారు చేసిన పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు. మూలపేట పోర్టు 30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు ? కాంట్రాక్టర్ కు మీకు సెట్టింగ్ కుదరలేదా? పోర్టును చూస్తే మీకు ఇబ్బంది ఏమిటి.? కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. ఇవాళ మనం ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. మూలపేట పోర్టు ఈ పాటికే పూర్తయ్యే ఉండేది. ఈ ప్రాంతానికే చెందిన టీడీపీ నేత స్వర్గీయ ఎర్రన్నాయుడు గారితో ఆ రోజు టీడీపీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని తీర్మానం చేయించారు. దానికి మంత్రి అచ్చన్నాయుడు ఏం సమాధానం చెప్తారు? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే మీరు ఇవాళ ప్రజాసంక్షేమం కోసం మాట్లాడ్డం సిగ్గుచేటు. అందుకే ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. మా హాయంలో ప్రారంభించి 70 శాతం పనులు పూర్తి చేసిన మూలపేట పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయకుండా మీ మామూళ్ల కోసం పనులు సాగనివ్వరా? వ్యవసాయశాఖ మంత్రిగా అచ్చన్నాయుడు ఈ ప్రాంత రైతులు పండించిన మొక్కజొన్నకు మద్ధతు ధర కల్పించారా? మీకు సిగ్గనిపించడం లేదా?. ఈ ప్రభుత్వానికి నూరేళ్లు నిండడానికి ఇంకో రెండేళ్ల కాలం ఉంది, ఇప్పటికైనా ఆ మిగిలిన పనులు పూర్తి చేసి న్యాయం చేయాలి. అలా కాకుండా ఎవరి పిల్లలకూ మీ పేరు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? మీకున్న బెరుకు ఏంటి? బాధ్యత వ్యక్తులగా మేం వెళ్తామంటే మీ అభ్యంతరం ఏంటి? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు చంద్రబాబూ? గుర్తుపెట్టుకొండి. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకుంటే.. త్వరితగతిన మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోర్టు పనులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని, భయంతో ఎంతోకాలం పరిపాలన చేయలేరని చంద్రబాబును హెచ్చరించారు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి జపం తప్ప మిగిలిన ప్రాంతాలు పట్టవా? : మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు...
వైయస్సార్, వైయస్.జగన్ లు చెరో ఐదేళ్లే పాలించినా, జిల్లా వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకు అనేక ప్రాజెక్టులు తెచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కానీ, టీడీపీ 25 ఏళ్లు అధికారంలో ఉన్నా చంద్రబాబు జిల్లాకు శాశ్వత ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా? అని నిలదీశారు. మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, వీరు రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదన్నారు. వీళ్లకు అనుకూల పత్రికల్లో వచ్చే హెడ్డింగ్స్ చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. "ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు" అన్నారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? అంతా అమరావతిలోనే పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తరహా పొరపాటు మళ్లీ చేస్తున్నారన్నారు. వైయస్.జగన్ పోర్టులు, హార్భర్లతో వికేంద్రీకరణ అభివృద్ధికి రూపకల్పన చేశారన్నారు. "తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా? శ్రీకాకుళం, ఉద్దానం ప్రజల కష్టాలు మీకు పట్టవా?" అని ప్రశ్నించారు. ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారని, శాసనసభ్యులే దాడిచేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం, ట్యాబులు ఇస్తే, చంద్రబాబు వాటిని తీసేసి, ముగ్గురు పిల్లలను కనండి రూ.25వేలు ఇస్తామని చెబుతున్నారని, ప్రపంచం ఎటు వెళ్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దాలు ప్రచారం చేశారని, ఇప్పుడు ఆ చట్టం కేంద్రం తెచ్చింది కాదా? అని ప్రశ్నించారు. రైతులకు ఎరువులు, గిట్టుబాటు ధర ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమిదని, పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిద్దామని ధర్మనా ప్రసాదరావు పిలుపునిచ్చారు.

వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన గొప్ప వరం..మూలపేట పోర్టు -మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ..
అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మూలపేట పోర్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అంటే అది వారి దివాళాకోరు రాజకీయానికి నిదర్శనం. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు కలను నిజం చేసిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ గారు. శ్రీకాకుళం జిల్లాకు మీరు తీసుకొచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైయస్ జగన్ పెద్దన్న పాత్ర: మాజీ డిప్యూటి సిఎం పాముల పుష్పశ్రీవాణి
మూలపేట పోర్టు దశాబ్దాల కల, ఆ కలను వైయస్ జగన్ నెరవేర్చారు. తమ ప్రభుత్వం హయాంలో 70 శాతం పనులు పూర్తి చేశాం, ఇప్పుడు 30 శాతం పనులు కూడా పూర్తిచేయలేని ప్రభుత్వం అధికారంలో ఉంది. వైయస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే భయంతో పనులు నిలిపివేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైయస్ జగన్ పెద్దన్న పాత్ర పోషించారు.
క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది : మాజీ మంత్రి కురసాల కన్నబాబు ..
క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇతరుల పనులను తన పేరుతో చెప్పుకోవడమే ఆయన రాజకీయం. ఒక పోర్టు కూడా నిర్మించని చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. వైయస్ జగన్‌కు పేరు రాకూడదనే ఉద్దేశంతో ఈ పోర్టు పనులు నిలిపివేశారు.
రెండేళ్లలో ఒక్క శాతం పనీ చేయలేదు: తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్.
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి 70 శాతం పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలువేనని, రానున్న రెండేళ్లలో పోర్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మూలపేట పోర్టు ఘనత జగన్నదే: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
మూలపేట పోర్టు వైయస్ జగన్ సంకల్పంతో ప్రారంభమైంది. తమ హయాంలో 70 శాతం పనులు పూర్తిచేశాం, మిగిలిన పనులు పూర్తి చేయకుండా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందడం కొందరికి ఇష్టం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోర్టు ఘనత జగన్నదే. ఉత్తరాంధ్రలో వలసలను అరికట్టాలని వైయస్ జగన్ సంకల్పించారు. ఈ ప్రాంతానికి ఆయన ఊపిరి పోశారు. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ , మూలపేట పోర్టు కోసం పోరాటం కొనసాగిస్తాం. అమరావతిపై చూపిన శ్రద్ధను ఉత్తరాంధ్రపై ఎందుకు చూపడం లేదు.

భారీ పోలీస్ బందోబస్తు.. అడ్డంకులు .. :
‘మన మూలపేటకు పోదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముల్లకంచెలతో కేట్లు ఏర్పాటు చేసి, మూలపేటకు వచ్చే ప్రధాన రహదారులను బ్లాక్ చేశారు. పోర్టు రోడ్డును టిప్పర్లతో మూసివేసి నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టులకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ వైసీపీ శ్రేణులు వెనుకడుగు వేయకుండా పెద్దఎత్తున తరలివచ్చాయి.