YS Sharmila hot comments :
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియా, సోషల్ మీడియా చేతిలో ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వివేకా హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని, కడప ఎంపీ పదవికి అవినాష్‌రెడ్డి (Avinash Reddy) సరికాదని వివేకానందరెడ్డి స్వయంగా నాతో చెప్పుకున్నారని షర్మిల ఆసక్తికర కామెంట్స్ చేసారు. వివేకానందరెడ్డి ఎంత చెప్పినా.. జగన్(Ys Jagan) కడప ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికే ఇచ్చారన్నారు. వివేకానందరెడ్డి బతికి ఉంటే తనకు ఎప్పటికైనా అడ్డే అని అవినాష్‌రెడ్డి భావించారని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వివేకానందరెడ్డిని సునీత భర్త హత్య చేసినట్లు అవినాష్‌రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
వివేకానందరెడ్డిని సునీత భర్త సొంత తండ్రిలా చూసుకునేవారన్నారు. వివేకా హత్యను గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి మీడియా.. వివేకా హత్య టీడీపీ పనే అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరింది జగనే అంటూ వ్యాఖ్యానించారు.
వివేకా హత్యను అడ్డం పెట్టుకుని సీఎం అయింది కూడా జగనే అంటూ షర్మిల మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక, సునీత సీబీఐ విచారణ కోసం ఎంత కోరినా ఒప్పుకోలేదన్నారు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. వివేకా హత్య కేసును ఎందుకు కొలిక్కి తేలేకపోయారని నిలదీశారు షర్మిల. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని దొంగ ఏడ్పులు ఏడవడం కాదు, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ఎంపీలందరితో కేంద్ర ఎన్నికల కమిషనర్ పై ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయించాలని ఆమె సవాల్ చేసారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలంటే ముందుగా తన వైఖరిలో మార్పు తెచ్చుకోవాలని, లేదంటే ప్రజలు ఆయనను ఎప్పటికీ ఆదరించరని స్పష్టం చేశారు. జగన్ హయాంలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే జరిగాయని, అది ఒక పెద్ద స్కామ్ అని మండిపడ్డారు.
అన్న అనే పదానికి వైఎస్ జగన్ కళంకం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అసలు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదని అన్నారు.వివేకా హత్యపై వైసీపీ నాయకులు వెలివేస్తేనే సునీత ఒంటిరి పోరాటం చేస్తోందని, మీరు న్యాయం చేయనందునే సునీతకు కర్మ పట్టిందని అన్నారు.సునీతకు సీబీఐ, బీజేపీ అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు.