- ఒంగోలు వైసీపీ కొత్త ఇన్ చార్జిని ప్రకటించిన వైఎస్ జగన్ ...
- వైసీపీ కొత్త ఇన్చార్జ్ గా చుండూరి రవిని ప్రకటన ...
- బాలినేని మళ్లీ వైసీపీలోకి తిరిగి వస్తారని ప్రచారం ఉపందుకున్న వేళ...
- కొత్త ఇన్ చార్జి నియామకంతో బాలినేని మూసుకుపోయిన ద్వారాలు...
అమరావతి :
ఒంగోలు వైసీపీ ఇన్ చార్జి పై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలుకు వైసీపీ కొత్త ఇన్ చార్జిని ప్రకటించారు వైఎస్ జగన్. అయితే ఈ ప్రకటన మాజీ మంత్రి, వైఎస్ జగన్ సమీప బందువు బాలినేని శ్రీనివాసరెడ్డి అశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఒంగోలు వైసీపీ కొత్త ఇన్చార్జ్ గా చుండూరి రవిని ప్రకటించారు. దీంతో బాలినేనికి ఇక వైసీపీలో ద్వారాలు మూసుకుపొయినట్లైంది.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత, మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఇన్చార్జ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడారు. జనసేనలో చేరారు. అయనను గతంలో మంత్రి పదవి నుంచి తొలగించిన నాటి నుంచి కొంత అసంతృప్తితోనే ఉన్నారు. కానీ బాలినేని జనసేనలో చేరిన అనంతరం కనీస గౌరవం కూడా ఆయనకు దక్కలేదు. దీంతో జనసేనలో ఉక్కిరిబిక్కిరిగా... ఆసౌకర్యంగానే ఉన్నారు. దీంతో మళ్లీ వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉపందుకుంది. అయితే అలాంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ, ఒంగోలులో రవికే తన మద్దతు వుంటుందని జగన్ ప్రకటించడం విశేషం. ఇక బాలినేనికి ఒంగోలు వైసీపీలో చోటు లేదని క్లారిటి వచ్చేసింది.
చుండూరి రవిని ప్రకటించిన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ...... ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రవి అయితే బాగుంటుందని అందరం కలిసికట్టుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఒకటిన్నర ఏడాది క్రితం అతను వైసీపీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రయాణం మొదలు పెట్టాడన్నారు. పార్టీ పిలుపు మేరకు స్పందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నట్టు రవిపై ప్రశంసల జల్లు కురిపించారు. రవికి ఎప్పుడూ తన మద్దతు వుంటుందని వైఎస్ జగన్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఎవరీ చుండూరి రవి... :
చుండూరి రవి ఇది వరకు జడ్పీటీసీగా పని చేస్తూ ప్రజల తరఫున వారి సమస్యల పరిష్కారానికి ఉత్సాహంగా పనిచేసే వాడు. అతను నిత్యం ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి బాలినేని పార్టీ మారిన అనంతరం అంటే... యేడాదిన్నరగా చుండూరి రవి ఒంగోలులో వైసీపీ తరుపున కార్యక్రమాలను బలంగానే తీసుకెళ్తున్నారు. యేడాదిన్నరగా అతను పార్టీ తరుపున చేస్తున్న పోరాటాల నేపధ్యంలో అధినేత ఇప్పుడు పూర్తి స్దాయిలో బాధ్యతలు అప్పగించి... తన మద్దతు రవికి పూర్తి స్దాయిలో ఉంటుందని హామీ ఇచ్చారు. 
రెడ్డికి బదులుగా కమ్మ నేతకు అవకాశం.... :
ఒంగోలు నియోజకవర్గం వైసీపీ ఈ సారి రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినట్లైంది. గతంలో కమ్మ సామాజిక వర్గం నుంచి జీవరత్నం నాయుడు వంటి కమ్మ నేతలు గెలుపొందిన చాలా కాలం పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బాలినేని గెలుపొందుతూ వచ్చారు. కానీ ఈ ఈసారి రెడ్డిని కాదని కమ్మ సామాజిక వర్గానికి కూడా అవకాశం ఇవ్వడం వెనక ఓ బలమైన కారణం ఉందని సమాచారం. ఎలాగూ రెడ్డి సామాజిక వర్గం వైసిపి ఓటు బ్యాంకు గా ఉండగా.... ఇప్పుడు చుండూరు రవికి అవకాశం ఇవ్వడం ద్వారా కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా రాబట్టాలనేది వ్యూహంగా కనబడుతుంది. చుండూరు రవికి ఒంగోలు తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల కమ్మ సామాజిక వర్గ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి చుండూరు రవికి వైసిపి ఇన్చార్జిగా ఇచ్చారని తెలుస్తుంది.