* డ్రగ్స్ వద్దు బ్రో నినాదం కేవలం పబ్లిసిటీ కోసమేనా?
* మీ పార్టీ నేతల సంగతేంటి లోకేష్?
* వరుసగా కూటమి నేతల అసభ్య బాగోతాలు
* రాసలీలల్లో ఒకరు, డ్రగ్స్ వ్యవహారంలో మరొకరు
* అస్తవ్యస్తంగా కూటమి పాలన
* తప్పుడు కేసులు నమోదు లో పోలీసులు అత్యుత్సాహం
* తప్పుడు పనులు ఆపడంలో మాత్రం వైఫల్యం
* ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు
* ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ:
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడటంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అంటే 'తెలుగు డ్రగ్స్ పార్టీ'గా మారిందని మండిపడ్డారు. ఎంపీ పుట్టా మహేష్ బాగోతంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నేతల ద్వంద్వ ప్రమాణాలను ఆయన ఎండగట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కేవలం అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకురాలేరన్న విషయాన్ని గ్రహించాలని తేల్చి చెప్పారు. ఎంపీ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు తన స్పందనేంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి" అని కన్నబాబు డిమాండ్ చేశారు.
ఇంకా ఏమన్నారంటే...
- టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ లో పోలీసులకు దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన చూస్తుంటే... రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిందన్న అనుమానం కలుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ఫాం హౌస్ పై పోలీసులు చేసిన దాడిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు మరో శాసనసభ్యుడి కుమారుడు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడితే ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. సాధారణంగా ఉదయం లేచిన దగ్గరనుంచి సమాజానికి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారు?
- డ్రగ్స్ తో పట్టుబడినా టీడీపీ నేతలపై చర్యలు నిల్...
డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిద్దామంటూ.. డ్రగ్స్ వద్దు బ్రో అని చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ భారీ ఉద్యమం నడిపి, ప్రచారం కూడా చేశాడు. అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజలకు మాత్రమే చెప్పే టీడీపీ నేతలు, వారి పార్టీలో మాత్రం డ్రగ్స్ సేవిస్తారా? టీడీపీ ఏ స్థాయికి దిగజారిందంటే ఎదుటవారికి మాత్రమే నీతులు చెబుతూ... తాము మాత్రం అన్ని దుర్మార్గాలే చేస్తుంటారు. ఓ టీడీపీ నేత రాసలీలల వీడియో పట్టుబడితే.. మరో నేత అసభ్యంగా మహిళల పట్ల ప్రవర్తిస్తూ పట్టుబడతారు. కొంతమంది గంజాయితోనూ, మరికొందరు డ్రగ్స్ తో పట్టుబడినా పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ ఎలాంటి స్పందన ఉండదు.
- డ్రగ్స్ వదిలి - రెడ్ బుక్ అమల్లో పోలీసులు..
డ్రగ్స్ రహిత ఏపీ అని హోంమంత్రి ప్రకటన ఇచ్చిన పదిరోజుల లోపే ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్, గంజాయి రెండూ పట్టుబడ్డాయి. చంద్రబాబు పూర్వ సొంత జిల్లా చిత్తూరులోని మదనపల్లెలో ఓ యువకుడు గంజాయి మత్తులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేస్తే దిక్కూ మొక్కూ లేదు. కుప్పంలోనూ గంజాయి పట్టుబడింది. చంద్రబాబు నివాసానికి సమీపంలోని ఇబ్రహీం పట్నంలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. అయినా పోలీసులు ఇవేమీ పట్టడం లేదు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ... తప్పుడు కేసులు నమోదు చేయడంలో బిజీగా ఉన్నారు. శాంతి భద్రతలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికివదిలేసింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడితే ఇంకా సిగ్గులేకుండా వైయస్.జగన్ ని తిట్టడం అలవాటుగా మారింది.
- ఎంపీ డ్రగ్స్ వ్యవహారంపై మీ స్పందనేంటి చంద్రబాబూ .. ?
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్.. టీడీపీలో కీలక నేత డ్రగ్స్ వ్యవహారంలో దొరికితే మీ పార్టీ స్పందన ఏంటనేదానిపై సమాజం ఎదురు చూస్తుంది. కేవలం ఎదుటివారికి చెప్పడానికే మీకు నీతులు ఉన్నాయా? డ్రగ్స్ అరికడుతున్నామని చెబుతున్న మీ ప్రచారం ఏమైంది? బాధ్యతాయుతమైన స్ధానంలో ఉన్న వ్యక్తులే ఈ రకమైన పనులకు పాల్పడ్డం అత్యంత దారుణం. రెండు రోజుల పాటు మౌనంగా ఉంటే... అంతా సద్దుమణిగి పోతుందన్నదే మీ ఆలోచనగా కనిపిస్తోంది.
ఈ రాష్ట్రంలో ఇవాల్టికి కూడా పెద్ద ఎత్తున గంజాయి, నాటు సారా ఎక్కడి పడితే అక్కడే దొరుకుతుంది. అక్రమ సారా భారీగా తయారు చేసి పెద్ద విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు విశాఖలో ఒక కంటైనర్ దొరికితే దానిమీద కూటమి పార్టీ నేతలు అప్పటి వైయస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతమైన దుష్ప్రచారం చేశాయి. లక్షల కోట్ల డ్రగ్స్ అంటూ మీకున్న ప్రచార మాధ్యమాలతో దుమ్మెత్తి పోశారు. తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి డ్రగ్సే కాదని రిపోర్టులు వస్తాయి. మీకున్న శక్తితో ప్రచారం చేసుకుంటూ నడిపిస్తున్నారు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అడ్డంగా దొరుకుతున్న ఉదంతాలే మీ ప్రచార ఆర్భాటాలకు ,వాస్తవాలకు ఉన్న తేడాను తెలియజేస్తోంది. ఇటీవలే టీటీడీ పాలకమండలి చైర్మన్, మరో శాసనసభ్యుడి బాగోతం వెలుగులోకి రాగా... ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. అయినా అడ్డగోలుగా మీ అనుకూల ప్రచారం చేస్తూ... తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి మీకున్న ప్రణాళికలు ఏంటో కూడా తెలియడం లేదు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడానికే తప్ప.. ఇలాంటి తప్పుడు పనులు ఆపే కార్యక్రమాలు చేయలేకపోవడం సిగ్గుచేటని కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఎంపీ డ్రగ్స్ వ్యవహారంపై సమాధానం చెప్పాలని, తద్వారా సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.