టిడిపికి డ్రగ్స్ మరక ....!
* హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ భగ్నం.
* మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో పార్టీ ...
* 10 మంది అరెస్ట్..! ...అరెస్టైన వారిలో ఏలూరు ఎంపి మహేష్ యాదవ్...
హైదరాబాద్ :
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమంటూ చెబుతున్నా తెలంగాణ, ఎపి సిఎంలకు షాక్ తగిలింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్న తెలంగాణ సిఎం రాష్ట్రంలో ...వైసీపీ హాయంలో ఎపిని గంజాయి రాష్ట్రంగా మార్చారని అరోపిస్తున్న టిడిపికి చెందిన ప్రజాప్రతినిధి, ఏలూరు ఎంపి పుట్టా మహేష్ యాదవ్ పట్టబడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో టిడిపికి డ్రగ్స్ మరక అంటినట్లయ్యింది. ఇటీవలే హైదరాబాద్ లో జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి తనయుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరువక ముందే మరో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడం కలకలం రేపుతొంది.ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రజా ప్రతినిధుల స్థాయి వారే ఇలా డ్రగ్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగైతే ఎలా? ఎపి, తెలంగాణ రాష్ట్రాలు డ్రగ్స్ నుంచి ఎలా బయటపడతాయి అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ డ్రగ్స్ పార్టీ కథా కమామిషేంటో చూద్దాం :
హైదరాబాద్ శివార్లలో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, మద్యం పార్టీ జరుగుతోందని తెలియడంతో తెలంగాణ ఈగల్ టీమ్, పోలీసులు కలిసి దాడి చేసి, భగ్నం చేసింది. పోలీసులు వెళ్లినప్పుడు.. ఫామ్ హౌస్‌లో ఉన్న ఢిల్లీ వ్యాపారి నమిద్ మిశ్రా పోలీసులపై 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐతే పోలీసులు జాగ్రత్తగా అడ్డుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఈ ఘటనలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ అధికారుల సోదాల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్యాదవ్, మరికొందరు ప్రముఖులు పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశమైంది. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఈగల్ అధికారుల దాడి సందర్భంలో ఢిల్లీకి చెందిన వ్యాపారి కాల్పులకు తెగబడ్డాడు. రోహిత్ రెడ్డి సోదరుడి గన్ తో ఈ కాల్పులకు పాల్పడినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. మొత్తం మీద ఈ ఘటప తెలంగాణలో డ్రగ్స్ ఎలా విచ్చలవిడిగా దొరుకుతున్నాయో ...ఎపి, తెలంగాణాకు చెందిన ప్రజాప్రతినిధులు నీతులు చెబుతూ డ్రగ్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో స్పష్టం చేస్తోంది.
డ్రగ్ టెస్టులు: ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగెటివ్? :
పట్టుబడిన 10 మందికి యూరిన్ డ్రగ్ టెస్ట్ కిట్‌తో పరీక్షలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి.. ఈ ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మిగిలిన వారి బ్లడ్ శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. నిర్ధారణ కోసం రిపోర్టులు రావాల్సి ఉంది. నిర్ధారణ కోసం రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ ఘటనలో 2 గ్రాముల కొకైన్ (వైట్ పౌడర్)ని సీజ్ చేశారు. ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

పుట్టా మహేష్ యాదవ్ అరెస్టుతో టిడిపి డ్రగ్స్ మరక ..? :
పుట్టా మహేశ్ యాదవ్ తండ్రి సుధాకర్ యాదవ్ ప్రముఖ కాంట్రాక్టర్...కడప జిల్లా మైదుకూరు టిడిపి ఎమ్మెల్యే. బాగా డబ్బున్న కుటుంబం కావడంతో ఏలూరు టికెట్ ఇవ్వడానికి టీడీపీ పెద్దగా ఆలోచించలేదు. నిజానికి ఏలూరుకు మహేశ్ స్థానికేతరుడు. కడప జిల్లాకు చెందిన వాడైనప్పటికీ, ఆర్థికంగా స్థితిమంతుడు కావడం...మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అల్లుడు కావడంతో 2024 ఎన్నికల్లో కలిసొచ్చింది. అయితే ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పట్టుబడడం ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందిగా మారింది.
వైసీపీ పాలనలో గంజాయి విచ్చలవిడిగా కనిపించేదని చంద్రబాబు, లోకేశ్, పవన్, వంగలపూడి అనిత, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిత్యం విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులే డ్రగ్స్ పార్టీల్లో పట్టుబడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కొంత కాలం క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ ఈగల్ టీమ్కు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఏలూరు ఎంపీనే పట్టుబడడం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా డ్రగ్స్ మరక అంటినట్లేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలపై డ్రగ్స్ ప్రభావం :
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం జోరుగానే ఉందన్న వాస్తవం వరుస ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వాలు పూర్తిగా కంట్రోల్ చెయ్యలేకపోతున్నాయి. ఈ డ్రగ్స్ వాడే వారిలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల వంటి వారు ఉండటంతో.. వారు తమ పలుకుబడితో.. డ్రగ్స్‌ని తెప్పించుకోగలుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లబ్బులు, పబ్బుల్లో యువత, కాలేజీ విద్యార్థులు.. క్రమంగా ఈ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకొని.. తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది వారికి వ్యసనంలా మారుతోంది. ఫామ్‌హౌస్ పార్టీలూ, రేవ్ పార్టీలూ.. డ్రగ్స్ అడ్డాలుగా మారుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు..డ్రగ్స్ కేసులు బయటపడుతున్నాయి. ఈ డ్రగ్స్ వల్ల యువత మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఇలాంటి ఘటనలు చూసి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలని పిలుపునిస్తున్నా...మార్గదర్శకంగా ఉండాల్సిన పెద్దలే ఇలా డగ్ర్స్ కేసుల్లో పట్టుబడటం విమర్శలకు తావిస్తొంది.