- టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం...
* చిత్తూరు జిల్లా కాశీపెంటలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌కు రాయితీలు వర్తింపు...
* అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ ..
* క్యాబినెట్ అనంతరం మీడియా సమావేశంలో హెరిటేజ్ రాయితీలను వెల్లడించని మంత్రి పార్ధసారధి ...
అమరావతి :
ఎపి కేబినెట్ లో హెరిటేజ్ యూనిట్‌కు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలుగజేసే అమోదం తెలిపింది ప్రభుత్వం. సిఎం చంద్రబాబునాయుడు సొంత సంస్థ హెరిటేజ్ కు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది డెయిరీ పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం తెలిపగా, ఈ నిర్ణయంతో హెరిటేజ్ యూనిట్‌కు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంటలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌కు ఈ రాయితీలు వర్తిస్తాయి. హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ (సాంకేతిక పరిజ్ఞానం పెంపు) కోసం ఈ సబ్సిడీని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరెంట్ బిల్లులో యూనిట్ కి రూ.1 రాయితీ ఇవ్వాలని, హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566 శాతం, ఫ్లేవర్డ్ పాలు 131, పన్నీర్ 400 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ఈ భారీ రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో హెరిటేజ్ కు భారీ మొత్తంలో రాయితీలతో పాటు GST రీయింబర్స్‌మెంట్ (రీఫండ్) సౌకర్యాన్ని కూడా కల్పించే ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ :
హెరిటేజ్ సంస్థకు చెందిన ఈ రాయితీల అంశాన్ని కేబినెట్ సమావేశ అజెండాలో చివరి అంశంగా పెట్టి ఆమోదం తెలిపింది. సిఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వ్యవహారం కావడంతో జాగ్రత్తగా వ్యవహరించారు. వడ్డించే వాడు మనవాడైతే చివరలో కూర్చొన్న భయపడాల్సిన అవసరం లేదన్న సామెతాల ... చివరి అంశమైనా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ అమోదం తెలిపింది. అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన సంస్థ కావడం, ఇటీవల తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంతో హెరిటేజ్ షేర్లు భారీగా పతనమైన విషయం అందరికి తెలిసిందే. షేర్ల ధర విపరీతంగా పడిపోయిన నేపధ్యంలో p4 లో భాగంగా ప్రభుత్వం హెరిటేజ్ ను ఆదుకునే ప్రక్రియలో భాగంగా అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఏపీ కేబినెట్ ఆమోదించిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మీడియా సమావేశంలో హెరిటేజ్ రాయితీలను వెల్లడించని మంత్రి పార్ధసారధి ... :
కేబినెట్ రాయితీలకు సంబంధించి అంశం ఆమోదం తెలిపినా... ఈ సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి కేబినెట్ ఆమోదాలను అన్నింటిని వివరించి మీడియా సమావేశంలో చెప్పినా...హెరిటేజ్ రాయితీలను మీడియా సమావేశంలో వెల్లడించకపోవడం కొస మెరుపు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తే మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందన్న జాగ్రత్తలో భాగంగా హెరిటేజ్ అంశంపై మాట్లాడలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.