Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత ...

13 Mar 2026
06:26 PM
12

* హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్
* ఇవాళ డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థత
* నిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు
* చికిత్స పొందుతూ మృతి ...
* దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ...

హైదరాబాద్  : 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర (82) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇవాళ విషమించడంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హెచ్ జే దొర కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ లో డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన బాత్రూంలో పడిపోయినట్టు తెలుస్తోంది. హెచ్‌జే దొర తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.

1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హెచ్‌జే దొర శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందిన అయన, 1965లో ఐపిఎస్ లో చేరారు. మొదట హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీసుగా పని చేసి, అనంతరం కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేశారు.  సిబిఐలో ఎస్పీగా పని చేసిన సమయంలో అంతరాష్ట్ర అర్ధిక నేరాలను ఛేదించడంలో నైపుణ్యం సంపాదించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా,  1996 - 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా ఆయన విశేష సేవలు అందించారు. ముఖ్యంగా అయన తన 40 యేళ్ల సుదీర్ఘ కెరీర్ లో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని (నక్సలిజం) అణచివేయడంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గానూ జాతీయ స్థాయిలో పలు ఉన్నత పదవులు చేపట్టారు. దొర 1996లో డీజీపీగా ప్రమోషన్ పొందారు. శాంతిభద్రతల పరిరక్షణలో అయన చేసిన విశిష్ట సేవలకు గాను పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డు లభించింది. ఆయన తన సుదీర్ఘ వృత్తి జీవితానుభవాలతో 'జర్నీ త్రూ టర్బ్యులెంట్ టైమ్స్' పేరుతో ఆత్మకథను కూడా రచించారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు :

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె దొర మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్​కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ అధికారిగా, తన హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని చంద్రబాబు తెలిపారు. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని వివరించారు. హెచ్.జె దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!