* ఏకకాలంలో మూడు నగరాలపై విరుచుకుపడిన ఇజ్రాయేల్...
* ఇరాన్ పాలక యంత్రాంగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు ...
* దాడులతో ఇరాన్ ప్రజల ఉక్కిరి బిక్కిరి....
ఇరాన్ :
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఒక్కసారిగా మూడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ పాలక యంత్రాంగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం ఈ తరహా దాడులు ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి అనేకమంది గాయపడ్డారు, వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఇజ్రాయెల్ సేనలు వ్యూహాత్మకంగా ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశాయి.

ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్, షిరాజ్, అహ్వాజ్ నగరాలపై ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది. సైనిక నిఘా విభాగం ఇచ్చిన సమాచారం మేరకు గత 24 గంటల్లో ఈ ఆపరేషన్ పూర్తయింది. దక్షిణ ఇరాన్‌లోని షిరాజ్ నగరంలో, ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచిన బాలిస్టిక్ క్షిపణుల తయారీ, నిల్వ కేంద్రంపై దాడులు చేశారు. అలాగే టెహ్రాన్‌లో ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థకు చెందిన ప్రధాన స్థావరాలను ధ్వంసం చేశారు. దీనితో పాటు క్షిపణి విభాగాలు, పోరాట సామాగ్రి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ విమానాలు నిప్పులు కురిపించాయి.

పశ్చిమ ఇరాన్‌లోని అహ్వాజ్ నగరంలో ఇరాన్ పాలకులకు చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ కార్యాలయాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు వేస్తున్న డజన్ల కొద్దీ సైనికులను గుర్తించినట్లు IAF తెలిపింది. ఇరాన్ ఉగ్రవాద మూలాలను దెబ్బతీయడంలో భాగంగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఒక రోజులోనే దాదాపు 200 కు పైగా లక్ష్యాలపై వందలాది బాంబులను జారవిడిచినట్లు సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్‌ను రోర్ ఆఫ్ ది లయన్ గా ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ల కు నెతన్యాహు వార్నింగ్ ... :
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీకి హెచ్చరికలు జారీ చేశారు. తన తండ్రికి పట్టిన గతే మొజ్తబాకు కూడా పడుతుందని పరోక్షంగా సూచించారు. ఉగ్రవాద సంస్థల నాయకులకు తాను ఎలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వలేను అంటూ వ్యాఖ్యానించారు. మొజ్తబా ఖమేనీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేతిలో ఒక కీలుబొమ్మ అని, అతను బహిరంగంగా ముఖం కూడా చూపించలేడని ఎద్దేవా చేశారు.