Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

దేశంలో వంట గ్యాస్ సంక్షోభం ....! ఏజెన్సీల ముందు వినియోగదారుల బారులు ... !!

12 Mar 2026
01:12 PM
109

దిల్లీ  :

అమెరికా-ఇజ్రాయేలు - ఇరాన్ యుద్దం నేపధ్యంలో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభ నేపథ్యంలో దేశంలో వంటగ్యాసు (ఎల్పీజీ) సంక్షోభానికి దారితీస్తొంది. ఈ సంక్షోభం కారణంగా ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో కొరత ఆందోళన కలిగిస్తోంది. హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారిస్తున్నాయి. ఆలయాలు, మఠాలపై సైతం వంటగ్యాసు కొరత ప్రభావం కనిపిస్తోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమావా ఆలయంలో 'రామ్ రసోయీ' అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మైక్రోవేవ్ అవెన్లు, ఇండక్షన్ ప్లేట్ల వాడకం ప్రారంభించాలని ఐఆర్ సీటీసీ పశ్చిమ జోన్లోని కేటరింగ్ యూనిట్లను ఆదేశించింది. ఈ పరిస్ధితుల కారణంగా  వాణిజ్య సిలిండర్లను నల్లబజారులో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. 

Article Image

హోటళ్లు, రెస్టారెంట్లు 'తాత్కాలికంగా' మూతబడటం ప్రారంభం : 
ఈ సమస్య ప్రధానంగా వాణిజ్య LPG, అంటే హోటల్‌లు, రెస్టారెంట్లు, catering యూనిట్లకు సంబంధించిన పెద్ద సిలిండర్ల సరఫరాపై ప్రభావం చూపుతోంది. గృహ వినియోగ LPG మాత్రం ఎక్కువగా ప్రభావితం కాలేదు. కొన్ని పెద్ద నగరాల్లో, ముఖ్యంగా హోటల్‌లు రోజువారీ ఐదు నుండి పది వరకు సిలిండర్లను ఉపయోగిస్తాయి. కానీ ఇప్పుడు ఏజెన్సీల వద్ద తాత్కాలికంగా సరఫరా తగ్గడంతో హోటల్ యజమానులు పరిమిత సరఫరాతో పని చేయాల్సి వస్తోంది. దీంతో రెస్టారెంట్లు, క్యాంటీన్‌లు పరిమిత మెనూ మాత్రమే అందిస్తున్నారు. ఎక్కువగా గ్యాస్ వాడే స్వీట్లు, బేకరీ, తండూరీ రొట్టెల తయారీ కొంతకాలం నిలిపివేయబడింది. చిన్న టిఫిన్ సెంటర్లు కూడా కొద్దిరోజులుగా మూతబడే పరిస్థితి ఏర్పడింది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు 'తాత్కాలికంగా' మూతబడటం ప్రారంభమైంది. అంతేకాక LPG సిలిండర్ ధరల్లో కొంత పెరుగుదల సైతం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో LPG సిలిండర్ ధర దేశంలోనే అత్యధికంగా ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. 

Article Image

శిర్డీలో ప్రసాదం తయారీపై ఎఫెక్ట్ :
శిర్డీ సాయిబాబా గుడిలోని ప్రసాదాలయంలో రోజూ 40,000 వేల మంది భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదాన్ని సిద్ధం చేయడానికి అర టన్ను ఎల్పీజీ గ్యాస్‌ వినియోగం అవుతుంది. అయితే గ్యాస్ కొరత వార్తలు ఆలయ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం శిర్డీ సాయిబాబా సంస్థాన్‌లో 14రోజులపాటు ప్రసాదం తయారుచేయడానికి సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం శిర్డీ ఆలయంలో ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ప్రసాదం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈనెల చివర్లో శ్రీరామనవమి పండగ జరగనుంది. అప్పుడు గుడిలో లడ్డూలు, బూందీల తయారీని ఆపేయాల్సి వస్తుందని శిర్డీ సాయిబాబా సంస్థాన్ అధికారులు భయపడుతున్నారు.

Article Image
 
కలపను సిద్ధం చేస్తున్న దేవాలయాలు..  : 
అలాగే కర్ణాటకలోని పలు దేవాలయాలపై ఎల్పీజీ కొరత ప్రభావం పడింది. ఈ క్రమంలో ప్రసాదం తయారీకి కలపను నిల్వ చేస్తున్నాయి. ఇదే విషయంపై అఖిల కర్ణాటక హిందూ ఆలయ అర్చకుల సమాఖ్య (AKHTAF) అధ్యక్షుడు ఎంఎస్ వెంకటాచల్లయ్య స్పందించారు. కర్ణాటకలోని దేవాలయాలలో తక్షణ గ్యాస్ సంక్షోభం లేదన్నారు. "మా వద్ద ఒక వారానికి సరిపడా ఎల్పీజీ సిలిండర్ స్టాక్ ఉంది. అయితే గ్యాస్ కొరత తర్వాత కొనసాగితే భక్తులకు ప్రసాదం అందించడంలో సమస్యలు ఎదురవుతాయి. ఎల్పీజీ సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్రంలోని అనేక దేవాలయాలు కలపను నిల్వ చేయడం ప్రారంభించాయి" అని వెంకటాచల్లయ్య పేర్కొన్నారు.

పెళ్లిళ్లపై ప్రభావం  .. : 
ఎల్పీజీ కొరత ప్రభావం వివాహాలపై కూడా పడింది. గ్యాస్ కొరత ఏర్పడితే తాము గతంలో తీసుకున్న పెళ్లి క్యాటరింగ్ ఆర్డర్లను రద్దు చేసుకోవాల్సి వస్తుందని హోటళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పింప్రి-చించ్వాడ్‌లో గ్యాస్ కొరత రాబోయే రెండు నెలల్లో జరిగే 10,000 వివాహాలను ప్రభావితం చేయనుంది.సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో 30 శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో  గ్యాస్ కొరత కారణంగా కొంతమంది క్యాటరర్లు ఇప్పటికే భోజనం ధరకు పెంచేశారు. ప్లేట్‌కు 10-20 శాతం ఎక్కువ వసూలు చేయడం ప్రారంభించారు. ఇది ఆటోమేటిక్‌గా పెళ్లి ఖర్చులను పెంచేస్తుంది. దీంతో పెళ్లిళ్లు చేసే మధ్యతరగతి ప్రజానీకం ఆందోళన చెందుతోంది.


నల్లబజారులో గ్యాస్ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు : 
నల్లబజారులో గ్యాస్ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్రం ప్రకటించింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. బుక్ చేసిన రెండున్నర రోజుల వ్యవధిలో గృహ వినియోగదారులకు సిలిండర్ అందజేసే విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపింది. వంటగ్యాసు సమస్యపై కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది. గృహ వినియోగదారులకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలంది.

Article Image
గ్యాస్ కోరతపై కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు  : 
గ్యాస్ కొరత విషయంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ మండిపడింది. వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా మోదీ సర్కారు అబద్దమాడుతోందని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. ఎల్ పేజీ కొరతపై సభలో చర్చకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు ముందు ప్రదర్శన నిర్వహించారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!