ఢిల్లీ :
తిరుపతి ప్రాంతాన్ని అరుదైన ఖనిజ కారిడార్‌లో చేర్చాలని కేంద్రానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. బుధవారం అరుదైన ఖనిజాల అభివృద్ధి, వాటి ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించే అంశంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన ఖనిజాల కారిడార్‌ల ఏర్పాటు, తిరుపతి ప్రాంతాన్ని కూడా అందులో చేర్చే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన వివరాలు కోరారు.
ఈ ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు శాఖతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇస్తూ... కేంద్ర బడ్జెట్ 2026–27లో ఖనిజ సంపద కలిగిన తీర రాష్ట్రాలైన ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రత్యేక అరుదైన ఖనిజాల కారిడార్‌ల ఏర్పాటుకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.ఈ కారిడార్‌ల ద్వారా దేశంలో అరుదైన ఖనిజాల ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల శక్తివంతమైన వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నియోడియమియం, ప్రసియోడియమియం, సమారియం వంటి అరుదైన ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వాటితో తయారయ్యే అయస్కాంతాల దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఉందన్నారు. అలాగే అరుదైన ఖనిజాల తవ్వకం నుండి తయారైన ఉత్పత్తి వరకు జరిగే మొత్తం ప్రక్రియలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.
ఈ కారిడార్‌ల కోసం తగిన ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి గుర్తించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భవిష్యత్ దశల్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తిరుపతి ప్రాంతాన్ని కూడా ఈ కార్యక్రమంలో చేర్చే అవకాశాలను పరిశీలించాలని ఎంపీ గురుమూర్తి కోరారు.