హెల్త్ డెస్క్ :
మానవ శరీరంలో అత్యంత ప్రధాన భాగం గుండె. ఈ రోజుల్లో చెడు అలవాట్ల బారిన పడిన వారే కాకుండా....చాలా మంది యువత కూడా గుండె జబ్బులు బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు బారిన పడుతున్నారు. మనం నిత్యం వార్తల్లో యువత గుండెపోటు బారిన పడటం గమనిస్తూనే ఉన్నాం. అయితే, గుండె జబ్బులు అభివృద్ధి చెందినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆ లక్షణాల్ని గమనిస్తే ప్రాణాంతక పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు. క్షీణిస్తున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు..వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల గుండె జబ్బుల వేగంగా పెంచుతున్నాయి. గుండె జబ్బులు అభివృద్ధి చెందినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, తరచుగా మధ్య లేదా ఎడమ వైపున నొప్పి అనుభూతి ఉంటుంది. ఈ లక్షణాల పట్ల అప్రమత్తత ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం.
కానీ ఈ గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకునేందుకు....ప్రతి ఒక్కరు ముందుగానే 3 సూత్రాలు పాటిస్తే ఈ గుండె జబ్బుల బారిన పడకుండా తప్పించుకోచ్చునంటున్నారు డాక్టర్. ఎ. వంశీధర్. ఆ మూడు సూత్రాలేంటీ అయన మాటాల్లోనే ....
1. గుండెకు ప్రమాదకరం కానీ ఆహారపు అలవాట్లు .... :
మనం తినే ఆహారం రక్తపోటు (BP), కొలెస్ట్రాల్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి మన తినే అహారం ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలిగించని అహారాన్ని తీసుకోవడం ముఖ్యం. మనం తీసుకునే అహారంలో ఎలాంటి పదార్ధాలు ఉండాలంటే...

ఫైబర్ :
జొన్నలు, రాగులు, ఓట్స్ వంటి తృణధాన్యాలు, పండ్లు, పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి.
మంచి కొవ్వులు : నూనె వాడకం తగ్గించాలి. వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆలివ్ ఆయిల్, బాదం, వాల్‌నట్స్ , అవిసె గింజలు వంటివి గుండెకు మంచివి.
ఉప్పు తగ్గించడం : రోజువారీ ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.
ప్రోటీన్ మూలాలు : మాంసాహారులైతే చేపలు (ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం) తీసుకోవచ్చు. శాకాహారులు పప్పు ధాన్యాలు, సోయా, తక్కువ కొవ్వు ఉన్న పాల పదార్థాలు తీసుకోవాలి.
చక్కెర నియంత్రణ : స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్ని వీలైనంత వరకు తగ్గించాలి.
2. వ్యాయామాలు .... :

గుండె కండరాల్ని బలంగా ఉంచుకోవడానికి కొన్ని వ్యాయామాల్ని లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవాలి. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే ఆరోగ్యం ప్రతి ఒక్కరి సొంతం.
బ్రిస్క్ వాకింగ్ : ప్రతిరోజూ ప్రతి ఒక్కరు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఏరోబిక్ వ్యాయామాలు : సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ చేయడం వల్ల గుండె వేగం పెరిగి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
యోగా, ప్రాణాయామం : ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. ఒత్తిడి తగ్గితే గుండెపై భారం తగ్గుతుంది.
మెట్లు ఎక్కడం : లిఫ్ట్‌కు బదులుగా మెట్లు వాడటం వల్ల గుండె సామర్థ్యం పెరుగుతుంది.
3.జీవనశైలిలో మార్పులు :
నిద్ర : జీవనశైలీలో అతి ముఖ్యమైనది నిద్ర. రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర గుండెకు విశ్రాంతిని ఇస్తుంది.
బరువు నియంత్రణ : శరీర బరువు సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సరైన అహారాన్ని తీసుకుని, తగినంత వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి.
నీరు తాగడం : శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఎండకాలం జాగ్రత్తగా ఉండాలి.
వైద్యుణ్ని సంప్రదించడం : మీకు తరచుగా గుండె సంబంధిత లక్షణాలు కనపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించండి. తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

డాక్టర్ ఎ. వంశీధర్, ఎండి, డిఎం,
(సీనియర్ కన్సల్టెంట్ & ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ),
పల్స్ హాస్పిటల్, కడప