* రూ.కోటి విలువైన బంగారం, వెండి కానుకల చోరీ ....
* రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య ...
* బంగారం దుకాణాల్లో ఆభరణాల మార్పిడి..బ్యాంకుల్లో తాకట్టు..
* పెంచలయ్యపై కేసు..వెంటనే బెయిలు ...
* అత్తెసరు రికవరీ..ఆ తర్వాత దర్యాప్తు గప్‌చుప్ ...
* పరకామణి దొంగలకు ప్రభుత్వ పెద్దల దన్నుపై అనుమానాలు ...
* గత ప్రభుత్వ హాయంలో చోరీపై రాద్ధాంతం చేసిన చంద్రబాబు
* ఇప్పుడు నోరు మెదపకపోవడంపై విమర్శల వెల్లువ ...
* పరకామణి దొంగతనాలపై నోరు విప్పని ప్రభుత్వ పెద్దలు .. ?..
* మార్పిడి చేసిన దుకాణాలు..తాకట్టు పెట్టుకున్న బ్యాంకులపై చర్యలేవి ..?
* లోతుగా విచారిస్తే అసలు దొంగలు బయటపడిపోతారన్న భయమా?

తిరుపతి :
తిరుమలలో శ్రీవారి సొమ్మును నీకింత.. నాకింత అని పంచుకున్న తీరు తరచు వెలుగు చూడటం శ్రీవారి భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తొంది. తిరుమల పరాకమణిలో గతంలో జరిగన చోరీపైనే ఇప్పటికి జనం చర్చించుకుంటుండగానే... కొత్తగా ఏడుకొండల వాడికి జరుగుతున్న మరో అన్యాయం బట్టబయలయ్యింది. పరంధాముడి పరకామణిని దొంగలు కొల్లగొడుతున్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పించే బంగారం, వెండి వస్తువులను దర్జాగా చోరీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్‌లో అధికారంలోకి రాగానే మొదలైన ఈ దొంగతనాల వ్యవహారం 2025 జనవరిలో బయటపడింది. అయినా నామమాత్రపు కేసుతో సరిపుచ్చారు. తెరవెనుక ఉన్న ముఠాపై కూపీ లాగలేదు. కోటి రూపాయల బంగారం, వెండి చోరీ జరిగినట్లు గుర్తించినా కేవలం 555 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు చూపించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు.

ఈ చోరీకి పాల్పడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్యకు వెంటనే బెయిల్ రావడానికి ప్రభుత్వమే పరోక్షంగా సహకరించిందన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండడం కోసమే ఈ వ్యవహారాన్ని మమ అనిపించేశారన్న విమర్శలు లేకపోలేదు. అయితే టీటీడీ, పోలీసులు ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లకుండా ఆపిందెవరు? పెంచలయ్య వెనకున్న ముఠా ఎవరు? పెంచలయ్యను కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలెవరు? పెంచలయ్యే కోటి రూపాయలు కొల్లగొట్టాడంటే.. పరకామణిలో ఉన్న ఇంకెంతమంది ఇంకెన్ని కోట్ల విలువైన కానుకలు కైంకర్యం చేసి ఉంటారు? వీరందరినీ నడిపించింది ఎవరు? ఈ ప్రభుత్వం వచ్చాక పరకామణిలో భారీ చోరీ కథా కమామీషు ఇదీ..

ఇటీవల వెలుగుచూసిన ఘటనలు ... :
టీటీడీ పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వి.పెంచలయ్య స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు బిస్కెట్‌ను చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 2025, జనవరి 11న రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరకామణిలో కానుకలను తరలించే ట్రాలీకి ఓ కన్నం చేసి అందులో 100 గ్రాముల బిస్కెట్‌ను జార విడిచాడు. అనంతరం ఆ బిస్కట్‌ను తీసుకునేందుకు యత్నిస్తుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. తిరుమల పోలీసులు అతన్ని 2025, జనవరి 12న అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో రిమాండ్‌కు తరలించారు. పోలీసులు పెంచలయ్య నివాసంలో సోదాలు చేయగా విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024, సెప్టెంబరు నుంచి అతను పరకామణిలో తరచూ దొంగతనాలు చేస్తున్నట్టు వెల్లడైంది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణాలకు తీసుకువెళ్లి వాటిని మార్పిడి చేసేవాడు.
పెంచలయ్యపై కేసు..వెంటనే బెయిలు ... :
ఆ విధంగా 2024 సెప్టెంబరు నుంచి 2025 జనవరి మధ్యలో చాలాసార్లు శ్రీవారి నగలను దొంగిలించి బంగారు దుకాణాల్లో మార్పిడి చేసి అంతే విలువైన ఇతర నగలను తీసుకున్నాడు. అంతేకాదు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వోచర్లు, ఇతర పత్రాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కానీ పెంచలయ్య ఏ స్థాయిలో పరకామణిలో దొంగతనాలకు పాల్పడ్డాడు... ఎంత విలువైన బంగారు నగలను అప్పటికే దొంగిలించాడు అనేది అంతుచిక్కడం లేదు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలను కూడా వెల్లడించక పోవడం గమనార్హం. పెంచలయ్య రూ.కోటి విలువైన 555 గ్రాములు బంగారం, 157 గ్రాముల వెండి కానుకలను దొంగతనం చేసినట్టు... వాటిని రికవరీ చేసినట్టు ప్రకటించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత పెంచలయ్యకు కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. అతని బెయిల్‌ను టీటీడీ గట్టిగా వ్యతిరేకించలేదని తెలుస్తోంది. తద్వారా అతని బెయిల్‌కు పరోక్షంగా సహకరించారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
నాడు రాద్దాంతం ...ఇప్పుడు మాత్రం మౌనం .. :
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రవి కుమార్ అనే పరకామణి ఉద్యోగి విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తుండటంతో విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరకామణిలో వ్యవహరాలను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించడం ద్వారా ఈ దొంగతనాన్ని వెంటనే గుర్తించి అడ్డుకట్ట వేశారు. రవి కుమార్ భారతీయ కరెన్సీలో రూ.76వేల విలువైన అమెరికన్ డాలర్లను దొంగతనం చేసేందుకు యత్నించినట్టు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రిమాండ్‌కు పంపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ అంతటితో సరిపెట్ట లేదు. రవి కుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయించింది. పరకామణిలో రూ.76వేల దొంగతనానికి ప్రాయశ్చిత్తంగా రవి కుమార్‌కు చెందిన రూ.15కోట్ల ఆస్తులను టీటీడీ పేరిట రాయించింది. తద్వారా ఎవరైనా శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడితే ఎంత తీవ్రంగా స్పందిస్తామన్నది చేతల్లో చూపించింది. ఆ ప్రక్రియ అంతా లోక్ అదాలత్ ద్వారా న్యాయబద్దంగా నిర్వహించింది. అయినా సరే దీనిపై చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. వైసీపీ ప్రభుత్వం, నేతలపై దుష్పప్రచారం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.76వేల దొంగతనానికి రూ.15కోట్ల ఆస్తులను టీటీడీకి రాయించి ఇస్తే...మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధికారికంగా పేర్కొన్న దాదాపు రూ.కోటి విలువైన బంగారం, వెండి దొంగతనానికి పరిహారంగా ఎన్ని వందల కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాయించి ఇవ్వాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో పరకామణిలో భారీ స్థాయిలో బంగారు, వెండి ఆభరణాల దొంగతనం చేసిన బాగోతం బయటపడితే ఇప్పటి ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. ఆ కేసును సమగ్రంగా విచారించకుండా పోలీసు శాఖను ప్రభావితం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతామని ...ఉదాసీనత ... ?
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో టీటీడీ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పరకామణిలో దొంగతనాలను నిరోధించేందుకు మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతామని పేర్కొంది. మరి 2024 సెప్టెంబరు నుంచి 2025 జనవరి వరకు పెంచలయ్య పరకామణిలో ఎలా దొంగతనాలకు పాల్పడ్డాడు...? అంటే హైకోర్టుకు చెప్పినట్టుగా పరకామణిలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయలేదన్నది స్పష్టమవుతోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంటే పరకామణిలో దొంగతనాలకు పరోక్షంగా సహకరిస్తున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. అసలు పరకామణిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు నిర్వహిస్తున్న ఆర్గోస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో అతన్ని ఎవరు చేర్పించారు? శ్రీవారి హుండీ కానుకలను దొంగతనం చేసిన సొమ్ముతో అతను కొనుగోలు చేసిన ఆస్తులు ఏమిటి? ఎవరెవరి పేరున ఆ ఆస్తులు ఉన్నాయి? తదితర విషయాలపై పోలీసులు కనీసం దృష్టి సారించనే లేదు. ఒక్క పెంచలయ్యేనా... ఈ తరహా ఇంకెంతమంది శ్రీవారి బంగారు కానుకలను ఆ దుకాణాల్లో మార్పిడి చేస్తున్నారో అని సామాన్యులకు కూడా సందేహం రావడం సహజం. కానీ పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు చేయనే లేదు. అంతేకాదు చోరీ చేసిన శ్రీవారి బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టాడు కూడా. మరి అందుకు సహకరించిన బ్యాంకు అధికారుల పాత్ర ఏమిటన్నది కూడా పోలీసులు సందేహించకపోవడం గమనార్హం. ఆ విషయాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తే పరకామణి దొంగతనాల వెనుక ఉన్న ముఠా బాగోతం బట్టబయలవుతుంది. అందుకే అంత సమగ్రంగా దర్యాప్తు చేయకుండా పోలీసులను ప్రభుత్వ పెద్దలే కట్టడి చేసినట్టు ప్రచారం సాగుతొంది. దాంతో పోలీసులు కేవలం పెంచలయ్య వరకే దర్యాప్తును పరిమితం చేశారని, అది కూడా కేవలం 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి ఆభరణాలకే పరిమితమై కేసును సరిపుచ్చారు. అంతకుమించి పోలీసులు దర్యాప్తు చేయకపోవడం గమనార్హం.
పరకామణి దొంగతనాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి : సిద్దవటం యానాదయ్య, టిటిడి మాజీ సభ్యులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా....బీ ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచీ తిరుమలలో ఎదో ఒక ఘటన జరగడం అనవాయితీగా వస్తుంది. ఘనటలే కాదు... పరకామణిలో బంగారం చోరీలు షరా మామూలుగా మారాయి. కోట్ల విలువైన బంగారం, వెండి దొంగతనం చేసినట్టు ఇప్పటికి బయటపడింది. ఇంకా సమగ్రంగా దర్యాప్తు చేస్తే పరకామణిలో దొంగతనాల బండారం మొత్తం బయటపడుతుంది. ఈ దొంగతనాల వెనుక ఎవరు ఉన్నారు... ఎవరి ప్రోద్బలంతో దొంగతనాలు జరుగుతున్నాయన్నది నిగ్గు తేల్చాలి. కేవలం పెంచలయ్య వరకే దర్యాప్తును పరిమితం చేసి అసలు సూత్రధారులను రక్షించేలా ప్రస్తుత పాలకవర్గం, ప్రభుత్వం ఉద్దేశ్యంలా కపడుతొంది. అలా కాకుండా స్వచ్చంద విచారణ సంస్థలతో విచారణ చేపడతే వాస్తవం వెలుగులోకి వస్తుంద. కాబట్టి కేసును తక్షణం సిబిఐకి అప్పగించాలి.