• విడాకుల కేసు ముగిసే వరకు ఇంట్లోనే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని....
• కోర్టులో మరో పిటిషన్..
Actor Vijay wife's Case:
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌కు రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ స్థాపించి రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న దళపతి విజయ్‌కు భార్య సంగీత మరో షాక్ ఇచ్చింది. అమె ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసేంత వరకు తాను ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. విజయ్ విడాకులకు సంబంధించిన కేసు చెంగల్పట్టులోని జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో ఏప్రిల్ 20న విచారణకు రానుంది. ఇంతలో మరో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ భార్య సంగీత, బ్రిటిష్ రాజధాని లండన్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తె. ఆమె హిందూ. క్రైస్తవుడైన తమిళ సినీ నటుడు విజయ్ ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతుల నిశ్చితార్థం జూలై 10, 1998న లండన్‌లో జరిగింది. అక్కడే వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత, విజయ్, సంగీత ఆగస్టు 1999లో చెన్నైలో మరోసారి వివాహం చేసుకున్నారు. వారికి 25 ఏళ్ల కుమారుడు, 20 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అభిప్రాయ భేదాల కారణంగా విజయ్, సంగీత ఐదు సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో సంగీత తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో 24వ తేదీన పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. వారి మధ్య వివాహాన్ని రద్దు చేయాలని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌ను జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టుకు బదిలీ చేశారు. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 20న విచారించనున్నారు. ఆ రోజున ఇద్దరూ హాజరు కావాల్సి ఉంది.
అయితే విజయ్ భార్య సంగీత కోర్టులో విడాకుల కేసు వేయగానే ఓ వివాహ కార్యక్రమంలో సినీ నటి త్రిషను వెంటబెట్టుకుని ప్రత్యక్షమయ్యారు. ఇది ప్రసార మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. ఈ పరిణామాల నేపధ్యంలోనే సంగీత మళ్లీ ఇంట్లో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసిందా అన్న చర్చ నడుస్తోంది.