*11 మంది వైసీపీ ఎమ్మెల్యేలున్నా... 1100 మంది లాగా మాట్లాడుతున్నారు..
* వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు...
అమరావతి :
ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏపీ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష వైసీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. "వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందే ఉన్నా.. 1100 మందిలా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వారు చెప్పిందే ప్రజలు నమ్ముతున్నారు. కులాన్ని అడ్డం పెట్టుకొని వారు ఏది బడితే అది మాట్లాడుతున్నారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అందువల్ల ప్రజలు అదే నిజం అనుకునే పరిస్థితి ఉంటోంది" అంటూ పవన్ కళ్యాణ్ కొంత అసహనం వ్యక్తం చేశారు.
కానీ భిన్నమైన రీతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీని విమర్శించడంలోను, మాజీ సిఎం వైఎస్ జగన్ పై ఆరోపణలు చెయ్యడంలోను, నా కోడకల్లారా అంటూ వైసీపీ కార్యకర్తలను విమర్శించడం ఇప్పటి వరకు పవన్ నోట విన్నాము. కానీ ఇందుకు భిన్నంగా అదే పార్టీ బలాన్ని అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతుంటారన్నారు... వారు చెప్పే విషయాలను ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారన్నారు. వైసీపీ నేతలు చెప్పే మాటలే ప్రజలు నిజాలని బలంగా నమ్మే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకోవడంలో మాత్రం విఫలమవుతున్నామన్నారు.
కల్తీ వాళ్లే చేస్తారని... నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై మోపుతారని పవన్ కల్యాణ్ ఆగ్రహించారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా.. అన్ని కులాల వాళ్లు ఓట్లు వేయాల్సిందేనన్నారు. ఈ మధ్య కొందరు ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని, ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుందంటూ... వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించినట్టు వ్యాఖ్యానించారు. కులం దాటకపోతే ఏపీ విచ్చిన్నమవుతుందని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా మనమే చెప్పాలని అన్నారు. లేకపోతే ఎంత బడ్జెట్ పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. పోలవరం, అమరావతిని వైసీపీ పక్కన పెట్టిందని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
అయితే ఇటీవల కాలంలో తిరుమల లడ్డూ కల్తీ అంశంలోను, అనంతరం అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు, అనంతర పరిణామాలను వైసీపీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా....ఇప్పుడు కులం గురించి మాట్లాడింది కూడా వీరినేనన్న టాక్ నడుస్తుంది. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలపై కూటమి నేతల దాడులు... అనంతరం నమోదైన కేసులు... జరిగిన అరెస్టులంటే తమకు భయమే లేదన్నట్లు వైసీపీ నాయకులు వ్యవహరించారని, కేసులైతే ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తుండటం, మహా అయితే జైలుకు పంపుతారని, ఇంతకంటే ఏం చేస్తారనే ధిక్కార స్వరం పెరగడం వంటి పరిణామాలు ఇటీవల చూసిందే. ఈ కారణంగానే వైసీపీ బలంగానే ఉందన్నట్లు... 11 మంది ఉన్నా ...1100 మంది ఉన్నట్లు మాట్లాడుతుంటారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం .. పవన్ వైసీపీ బలాన్ని గుర్తించారంటూ ఆ పార్టీ క్యాడర్ హర్షాన్ని వ్యక్తం చేస్తుంది.