అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఈ దిశగా అడుగులు వేస్తుండటం మండలిలో ఉత్కంఠను రేపుతోంది.
వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పలువురు సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేసి, కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరు తమ ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా లేఖలను చైర్మన్ మోషేన్ రాజుకు సమర్పించారు. అయితే, సుమారు ఏడాది కాలంగా ఈ రాజీనామాలను చైర్మన్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంపై సదరు సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ రాజీనామాలు ఆమోదించకపోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైర్మన్ తీరుకు నిరసనగా ఆయనపైనే అవిశ్వాసం ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు.

రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ప్రస్తుత అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు జనసేన, బీజేపీ తీర్థం పుచ్చుకోగా, మరికొందరు టీడీపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ వంటి వారు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారు.
మరోవైపు, తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు గత రెండు వారాలుగా పట్టుబడుతున్నారు. దీనిపై ప్రశ్నోత్తరాల అనంతరం చర్చకు చైర్మన్ మోషేన్ రాజు అనుమతినిచ్చారు. అయితే, అదే సమయంలో రెబెల్ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తేవడం మండలిలో తీవ్ర గందరగోళానికి దారితీసేలా ఉంది. లడ్డూ అంశంపై చర్చ జరుగుతుందా లేక అవిశ్వాస తీర్మానంపై రచ్చ జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, సొంత పార్టీకి చెందిన రెబెల్ సభ్యులు చైర్మన్‌పై తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ ఇవాళే అవిశ్వాస తీర్మానంపై ఒక నిర్ణయానికి వచ్చి, దానిని ప్రవేశపెడితే మండలిలో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
మండలిలో మొత్తం 58 స్థానాలుండగా, వైసీపీకి 32 మంది సభ్యులున్నారు. ఆ పార్టీ తరపున గెలిచి లేదంటే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నవాళ్లు 9 మంది ఉన్నారు. ఒకరు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. కూటమికి 14 మంది (టీడీపీ 10, జనసేన 2, బీజేపీ 1) ఉన్నారు. వైసీపీ నుంచి దూరంగా ఉంటున్న 9 మంది కూటమికి మద్దతు ఇస్తే వాళ్ల సంఖ్య 23కు చేరుతుంది. అప్పటికీ వైసీపీదే పైచేయిగా ఉంటుంది. ఒకవేళ వైసీపీ సభ్యులు కొంతమంది గైర్హాజరు అయినా, లేదంటే వాళ్లలో కొంతమంది కూటమికి మద్దతి ఇస్తే తప్ప, మండలి ఛైర్మన్ పదవికి ఢోకా ఉండకపోవచ్చు.
మొత్తానికి, రాజీనామాల పెండింగ్ వ్యవహారం ఏపీ శాసనమండలిలో చైర్మన్ పదవికే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. కూటమి పార్టీల వ్యూహం, రెబెల్ ఎమ్మెల్సీల పట్టుదల వెరసి ఏపీ రాజకీయాల్లో మండలి వేదికగా మరో పోరు మొదలైనట్లే కనిపిస్తోంది.