మహబూబ్‌నగర్ :
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. మార్చురీ వంటి సున్నితమైన ప్రదేశాలలో కనీస రక్షణ కరువవడం, కుక్కలు లోపలికి వెళ్లి మృతదేహాన్ని పీక్కుతినే వరకు సిబ్బంది గుర్తించకపోవడంపై ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో మృతదేహాలకు కూడా గౌరవం దక్కడం లేదని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వార్తపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.
మంత్రి సీరియస్ - కమిషనర్ విచారణ - సస్పెన్షన్లు :
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశార. ఆయన ఆదేశాల అనంతరం.. మంగళవారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ స్వయంగా జడ్చర్ల ఆసుపత్రిని సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. మార్చురీ నిర్వహణలో దారుణమైన వైఫల్యం , విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో (RMO) హరినాథ్, డ్యూటీ డాక్టర్ , ఎంఎస్‌వో (MSO) ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్చురీల భద్రతను పటిష్టం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.