- పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చట్టపరంగా అడ్డుకోవాలి...
- -నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసి..
- ఎప్పుడో దశాబ్ధాలు పట్టే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు ..
-ప్రజల్లో చైతన్యం పెంచి...ఉద్యమంలోకి తీసుకువస్తాం ...
- కలిసి వచ్చే పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపకల్పన చేస్తాం...
-వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..
కడప :
రాయలసీయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే మొదలు పెట్టాలని, ఇందుకోసం ప్రజల్లో చైతన్యం పెంచి...వారిని కూడా ఉద్యమంలోకి తీసుకువస్తామని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపకల్పన చేస్తామని వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కడపలో రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం కడపలో నిర్వహించిన గ్రేటర్ రాయలసీమ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ఒక జిల్లాకు సంబంధించిన సమస్య కాదని, సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిందని, ఈ జిల్లాలకు ఉపయోగపడే రాయలసీమ లిఫ్ట్ విషయంలో చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
'మన హక్కును మనం రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం ఇది. ప్రతి ఒక్కరూ కింది స్థాయి టీడీపీ నాయకుడి నుంచి చంద్రబాబు వరకూ అందరిని ప్రశ్నించాలి. కూటమిలో సభ్యులైన జనసేన, బీజేపీ నాయకులను సైతం ప్రశ్నించాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు వెంటనే మొదలు పెట్టాలి. పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చట్టపరంగా అడ్డుకోవాలి. అడ్డగోలుగా కడుతున్న ప్రాజెక్టులను ఆపించే ప్రయత్నం చేయాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసి.. ఎప్పుడో దశాబ్ధాలు పట్టే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్..దాన్ని నిలబెట్టుకోవడం తక్షణ కర్తవ్యం. రాష్ట్ర రైతాంగంపై చంద్రబాబు కొట్టబోతున్న దెబ్బ ఎంత నష్టాన్ని చేకూరుస్తుందో ప్రజలు గమనించాలి. పక్క రాష్ట్రాలు అడ్డగోలు ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదో అర్ధం కావడం లేదు. కనీసం ఖండించడమో.. అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా ఉపక్రమించడం లేదు.
కేంద్రంలో భాగస్వామిగా ఉంటే అదనంగా తీసుకురావాల్సింది పోయి...ఉన్నవాటిని కట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆనాడు కేంద్రంలో భాగస్వామి కాకపోయినా పోలవరాన్ని 45 మీటర్లకు నిర్మిస్తే..భాగస్వామిగా ఉండి చంద్రబాబు 41 మీటర్లకు కుదించేందుకు ఒప్పుకోవడం దారుణం. చంద్రబాబు 2014–19 మధ్య పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తే.. జగన్ వచ్చాక పోరాడి నిధులు సాదించి 45 మీటర్ల మేర పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం ఎత్తు కుదిస్తుంటే చంద్రబాబు కిమ్మనలేదన్నారు. ప్రతీ రైతు దీని గురించి ప్రశ్నించాలి.. ప్రతీ ఇంట్లో చర్చ జరగాలి.. ఇది రాజకీయ సమస్య కాదని సజ్జల అన్నారు.
రాయలసీమ లిఫ్ట్ కోసం ప్రజలందరూ భాగస్వామ్యులయ్యేలా మేం ముందుకు అడుగులు వేస్తాం. ఆ దిశగా నేడు గ్రేటర్ రాయలసీమ నేతలమంతా సమావేశమయ్యాం. ప్రజల్లో చైతన్యం పెంచి...వారిని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలని నిర్ణయించాం. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలన్నిటిని కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపకల్పన చేస్తాం. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో చంద్రబాబు ద్రోహంపై చర్చ జరిగేలా చైతన్యవంతులను చేస్తాం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, కూటమి నేతలపై ఒత్తిడి తీసుకొస్తాం. కళాశాలలు, యూనివర్సిటీల్లోనూ యువతలో చర్చ జరిగే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మా పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉద్యమంలో పాల్గొంటారు. ఇది రాజకీయ అంశం కాదు...అందరం కలిసి పోరాడదాం' అని సజ్జల స్పష్టం చేశారు.