కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితలకు భారీ ఊరట....
- కోర్టు తీర్పు అనంతరం బోరున విలపించిన కేజ్రీవాల్..
DELHI :
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితలకు రౌస్ ఎవెన్యూ కోర్టు నుండి భారీ ఊరట లభించింది. కోర్టు తీర్పు అనంతరం మీడియా ముందుకు వచ్చిన కేజ్రీవాల్ అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు.
న్యాయం గెలిచింది: కేజ్రీవాల్ కన్నీళ్లు
తీర్పు వెలువడిన తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తనకు ఉన్న నమ్మకం నిజమైందని పేర్కొన్నారు. “ఈ రోజు మద్యం కేసులో నిందితులందరినీ కోర్టు విడుదల చేసింది. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. భారత న్యాయవ్యవస్థపై మాకు పూర్తి గౌరవం ఉంది” అని చెబుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. అధికారం కోసం ప్రభుత్వాలను కూల్చవద్దని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ భావోద్వేగానికి గురవడంతో పక్కనే ఉన్న మనీష్ సిసోడియా ఆయనను ఓదార్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసే కుట్ర :
ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి పెద్ద రాజకీయ కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీలోని ఐదుగురు కీలక నేతలను జైల్లో పెట్టారని, ముఖ్యమంత్రిగా ఉన్న తనను కూడా అన్యాయంగా కటకటాల వెనక్కి పంపారని ఆయన వాపోయారు. “నేను అవినీతిపరుడిని కాదు.. ఇప్పుడు కోర్టు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది” అని ఆయన ఉద్వేగంగా అన్నారు.
అవినీతిపరులని నిరూపించేందుకు కుట్ర : సిసోడియా
మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తమను అవినీతిపరులని నిరూపించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయని, కానీ అంతిమంగా తమ నిజాయతీ నిరూపితమైందని అన్నారు.
మరోవైపు ఈ తీర్పు నేపధ్యంలో కేజ్రీవాల్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు హారతులు ఇచ్చి, భావోద్వేగంతో స్వాగతం పలికారు. ఈ తీర్పుతో ఢిల్లీ జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది