లడ్డు కల్తీపై అసెంబ్లీలో కూటమి సొంత " క్లీన్ ఛీట్ "....
• అసెంబ్లీకి వైసీపీ దూరం కావడంతో.....
• చెప్పాలనుకుంది అడ్డంకులు లేకుండా చెప్పేసిన కూటమి...
• 26న మండలిలో చర్చ ఉండటంతో....
• అంతకంటే ముందే తమ వాయిస్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం
• తమ తప్పమీ లేదు...అంతా వైసీపీనే చేసిందంటూ విమర్శ ...
• మండలిలో ప్రతిపక్షం ఎదురుదాడి తప్పదా ?
అమరావతి :
తిరుమలకు సరఫరా ఆయన కల్తీ నెయ్యి వ్యవహారాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా పూర్తి స్దాయిలో వాడుకోవాలని కూటమి ప్రభుత్వం ఫిక్స్ అయింది. వాళ్ళ ప్రతి అడుగు- కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వైసీపీపై బురదజల్లే ప్రయత్నాలే చేస్తోంది. శాసనసభలో ఎటూ వైసీపీ వాళ్లు లేరు గనుక..ఏకపక్షంగా అధికార పార్టీ గళం మాత్రమే వినిపించింది. వారందరూ నెయ్య విషయంలో వైసీపీ మీద రకరకాల నిందలు వేశారు. తాము చెప్పాలనుకుంది ఎలాంటి అడ్డంకులు లేకుండా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది. అసలు మండలిలో 26న చర్చ ఉండగా ఇలా వారంతకు వారే చర్చ జరుపుకోవడం ఎంటో అంటూ ప్రజల్లో జరుగుతున్న చర్చ. కానీ ప్రతిపక్షం కంటే ముందే తాము చెప్పాలనుకుంది చెప్పి.... మసి గుడ్డ వైసీపీ ముఖాన వేయడం...తమంతట తామే క్లీన్ ఛీట్ ఇచ్చుకునే ప్రయత్నం చేసిందని చెప్పకనే చెప్పింది. 
ఇంతకీ అసెంబ్లీలో చంద్రబాబు ఏం చెప్పారు :
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలంటూ సభకు వివరించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని చెప్పారు. ఈ కుట్రలో కొంతమంది అధికారులు, నిపుణులు కూడా భాగస్వాములయ్యారని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ జరిగిన ఈ వ్యవహారాన్ని ఆయన 'మహాపాపం'గా అభివర్ణించారు. అసెంబ్లీలో సమర్పించిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో సుమారు 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీని ద్వారా సుమారు రూ. 231.51 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. నెయ్యి నాణ్యత లేదని రిపోర్టులు వచ్చినప్పటికీ, అప్పటి పాలకులు వాటిని బయటకు రాకుండా తొక్కిపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీబీఐ పర్యవేక్షణలో సాగుతున్న ఈ విచారణలో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక 'ఏక సభ్య కమిషన్'ను కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యి కూడా కొనుగోలు చేయలేదు : చంద్రబాబు ....
హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యి కూడా కొనుగోలు చేయలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసనసభలో స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు. కుటుంబ వ్యాపార సంస్థ అని, ప్రభుత్వంలో ఎక్కడా హెరిటేజ్ ఉత్పత్తులు సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి, నిజాయతీతోనే హెరిటేజ్ నిలబడిందని చెప్పారు. భారతీ సిమెంట్స్ నుంచి ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో సిమెంట్ వినియోగించారని సీఎం గుర్తుచేశారు. నేరస్థులు ఏ విధంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారనే దానికి ఇదో పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకి ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రోజూ 20 లక్షల లీటర్ల పాలు సేకరించి నీతి నిజాయతీతో హెరిటేజ్ సంస్థ వ్యాపారం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. " ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు నెయ్యి" విషయంలో ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పుణేలోని ఇందాపూర్ డెయిరీ ప్రముఖ కంపెనీలన్నింటికీ కో-మ్యానుప్యాక్చరింగ్ చేస్తోందన్నారు. మదర్ డెయిరీ, బ్రిటానియా, పతంజలి ఆయుర్వేద ఘీ, డీమార్ట్, రిలయన్స్, దొడ్ల, హ్యాట్సన్, జీఆర్‌బీ, అమూల్, హెరిటేజ్ వంటి సంస్థలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోందని వివరించారు. ఇలాంటి కో-మ్యానుప్యాక్చరింగ్ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. :
ఈ అపవిత్ర కార్యం చేసిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడాలని డిమాండ్ చేశారు. ఎన్‌డీడీబీ (NDDB) నివేదికలో జంతు సంబంధిత కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని గుర్తు చేశారు. కల్తీ నెయ్యిలో అసలు నెయ్యే లేదని, అది కేవలం రసాయనాల మిశ్రమమని సిట్ నివేదిక ద్వారా తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ పవిత్రతను కాపాడటంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ప్రభుత్వం విమర్శించింది. ఎన్‌డీడీబీ రిపోర్టును తాను చదవడం వెనుక ఆ భగవంతుడి సంకల్పం ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో పటిష్టమైన నిబంధనలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థల పర్యవేక్షణలో లోతైన విచారణ జరుగుతోంది. లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో, దోషులను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 
రేపు మండలిలో ప్రతిపక్షం ఎదురుదాడి తప్పదా ?
అసెంబ్లీలో ప్రతిపక్షం ఎవరు లేకపోవడంతో ఎలాంటి వాదొపవాదాల్లేకుండా సాఫీగా అధికార పక్ష్యం అనుకుంది చెప్పింది. కానీ మండలిలో మాత్రం ప్రతిపక్షం ఎదురు దాడికి ఆత్రుతగా ఎదురుచూస్తోంది. హెరిటేజ్ - ఇందాపూర్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మండలిలో చర్చ జరపాలంటూ ఆధారాలు పట్టుకుని మండలిలో ప్రతిపక్ష వైసిపి ఆందోళన చేపట్టింది. ఎట్టకేలకు ఫలించిన వైసిపి ప్రయత్నం 26వ తేదీ అంటే రేపు మండలి చైర్మన్ చర్చకు అనుమతించారు. ఇప్పటికే తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ చెబుతున్న వైసిపి సభ్యులు రేపు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం ఖామన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రతిపక్షం నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు అధికారపక్ష్యం సమాధానాలు చెబుతుందా... లేక దాటవేత ధోరణితో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎదురుదాడి చేసినట్లు నమ్మిస్తుందా అన్నది రేపటి సమావేశంలో తేలనుంది. ఏదేమైనా అసెంబ్లీలో జరిగిన చర్చకు భిన్నంగా మండలి లో చర్చ జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.