మెక్సికో మాఫియా డాన్ 'ఎల్ మెంచో' హతం.. !
• ఏకంగా రూ.130 కోట్ల రివార్డ్....
• మెంచోతో పాటు మరో ఆరుగురు కీలక గ్యాంగ్‌స్టర్లు కూడా హతం..
• అల్లర్లు ఎక్కువవడంతో భారత పౌరులకు కీలక హెచ్చరిక...
El Mencho killed Mexico Army Operation :
ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత ఎల్ మెంచో కథ ముగిసింది. మెక్సికో సైన్యం ఆదివారం నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్‌లో అతడిని మట్టుబెట్టారు. ఈ వార్త తెలియగానే మెక్సికో వ్యాప్తంగా మాఫియా ముఠాలు విధ్వంసానికి దిగడంతో ఆ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఈక్రంమలోనే భారత విదేశాంగ శాఖ.. అక్కడి భారత పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.
అర్ధరాత్రి దాడి .. ఆసుపత్రికి వెళ్లేలోపే.. :
59 ఏళ్ల ఎల్ మెంచో ఆచూకీపై అమెరికా నిఘా సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో మెక్సికో సైన్యం జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణాన్ని చుట్టుముట్టింది. అతడు నక్కిన స్థావరాన్ని సైనికులు ముట్టడించగా.. మెంచో అనుచరులు యధేచ్ఛగా కాల్పులకు దిగారు. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బంధించి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆపరేషన్‌లో మెంచోతో పాటు మరో ఆరుగురు కీలక గ్యాంగ్‌స్టర్లు కూడా హత మయ్యారు.
మాఫియా సామ్రాజ్యానికి రారాజుగా ఎల్ మెంచో.. :
2009లో జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్‌ను ప్రారంభించిన ఎల్ మెంచో.. కేవలం దశాబ్ద కాలంలోనే దానిని మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేర సిండికేట్‌గా తీర్చిదిద్దాడు. అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తూ.. అగ్రరాజ్యానికి ప్రధాన ముప్పుగా మారాడు. అందుకే అమెరికా ప్రభుత్వం ఇతడి ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, అతడిని పట్టించిన వారికి 15 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.125 కోట్లు) రివార్డు ప్రకటించింది.
కీలక హెచ్చరికలు జారీ చేసిన భారత్ .. :
మెక్సికోలో మాఫియా ముఠాల అల్లర్ల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. భారత పౌరులంతా ప్రస్తుత పరిస్థితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాలకే పరిమితం కావాలని సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే మెక్సికోలోని భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలని ఆదేశించింది. ప్రస్తుతం మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ మోహరించింది. మాఫియా డాన్ మృతితో మరిన్ని ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.