• జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజాలకు మద్దతు ఇవ్వండి…
• మీ ఆశీర్వాదమే వారికి బలం..అంటూ ప్రజలను కోరిన రాధ..
•రాజకీయ వర్గాల్లో కుల కలకలం ....
Vangviti radha hot comment :
ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధ నోటి నుంచి మరోసారి చర్చకు దారి తీసిన వ్యాఖ్యలు వినిపించాయి. కూటమికి మద్దతుగా ఉన్న నేతగా భావించే వంగవీటి రాధ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన తండ్రి స్వర్గీయ వంగవాటి రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో రాధ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సమీకరణాలపై కొత్త సందేహాలు రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యల వెనక కూటమికి కాపుల సెగ తప్పదా అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యేలా చేశాయి.
గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపం డి.పోలవరం గ్రామంలో మోహనరంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధా, తన తండ్రిని “పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి”గా కొనియాడారు. విజయవాడ పరిసర ప్రాంతానికి చెందిన నాయకుడైనా దేశవ్యాప్తంగా అభిమానులు విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆయన ప్రజల గుండెల్లో ఎంత స్థానం సంపాదించుకున్నారో చూపిస్తోందన్నారు. కార్యక్రమంలో జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజా తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
అయితే అసలు రాజకీయ చర్చకు కారణమైనది ఆవిష్కరణ అనంతరం రాధ చేసిన వ్యాఖ్యలే. “మీరు జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజాలకు మద్దతు ఇవ్వండి… మీ ఆశీర్వాదమే వారికి బలం” అంటూ ప్రజలను కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం కూటమికి అండగా ఉన్న రాధ, ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలకు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికే వంగవీటి రాధా సోదరి వైసిపిలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుచుండగా...ఇప్పుడు రాధా వ్యాఖ్యల అనంతరం ఆయన కూడా త్వరలోనే కూటమికి గుడ్ బై చెప్పనున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో కాపులకు, జనసేన, బిజెపి కార్యకర్తలకు తప్ప... కేవలం టిడిపి నాయకులు మాత్రమే అధికారం అనుభవిస్తున్నారన్న అసంతృప్తి నానాటికి తీవ్రమవుతుంది. ఇప్పుడు రాధా చేసిన వ్యాఖ్యలతో కూటమికి కాపుల సెగ తప్పదు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే రాధా వ్యాఖ్యల వెనక మర్మం ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది రానున్న రోజుల్లో వేచి చూడాలి.