Telangana MPTC,ZPTC System:
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిపాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనాత్మక నిర్ణయంగ మారడం ఖాయమని చెప్పవచ్చు.
ఆశించిన అభివృద్ధి జరగడం లేదని సర్కారు భావిస్తోందా?
ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పాత్రపై ప్రభుత్వం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించింది. ఈ వ్యవస్థ రద్దు చేయాలనే ఆలోచన వెనుక మూడు బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తొంది.ఈ వ్యవస్థ ద్వారా ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులకు క్షేత్రస్థాయిలో సరైన అధికారాలు కానీ, నిర్దిష్టమైన బాధ్యతలు కానీ లేవని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కేవలం పదవులు ఉండి, నిధులు, విధులు లేకపోవడం వల్ల ఆశించిన అభివృద్ధి జరగడం లేదని సర్కారు భావిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయడం ద్వారా భవిష్యత్‌లో ఈ స్థానాలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమే ఉండదని, అంతేకాకుడా ఇది ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించమే కాకుండా తరచూ వచ్చే ఎన్నికల కోడ్ అడ్డంకులను కూడా నివారిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వ్యవస్థల వల్ల పాలనాపరంగా పెద్దగా ఉపయోగం లేదని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
త్వరలోనే ఈ ఎన్నికలపై నిర్ణయం!
ఈ ప్రతిపాదనపై స్పష్టత రావడానికి ఫిబ్రవరి 23న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం అత్యంత కీలకమైందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థల రద్దుపై ప్రభుత్వం చర్చించే అవకాశం ఉంది. ఈ లోగా ఈ అంశంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించాలని రేవంత్ ప్రభుత్వం పంచాయతీ రాజ్‌శాఖను ఆదేశించింది. ఈ నివేదికలో ఈ వ్యవస్థల వల్ల జరుగుతున్న లాభనష్టాలు, రద్దు చేస్తే కలిగే పరిణామాలు , ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను పొందుపరచనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు.. :
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది. సర్పంక్లకు మాత్రం లేదు. దీంతో సర్పంచులు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ, జెడ్సీటీసీలు సైతం తనుకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలంటూ కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నంటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దోరుకుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యనస్థలో మార్పులు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గతంలో దీని కోసం జరిగిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నారు.
వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం..
అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి ఈ వ్యవస్థ గుర్తింపును, పదవులను కల్పిస్తోందని.. దాన్ని రద్దు చేస్తే పార్టీల్లో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ కేరర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని, వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో గతంలో కేంద్రంలోని కాంగ్రెస్పోర్టీ తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందని చెబుతున్నారు.
రాజ్యాంగపరమైన అడ్డంకులు అధిగమించడం సులభమేనా ?
ప్రభుత్వం ఈ దిశగా చర్యలు వేగంగా తీసుకుంటున్నా చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఈ నిర్ణయం అమలు చేయడం అంత సులభం కాదని తెలుస్తోంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే తీరుగా అమలులోకి వచ్చింది.రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, రాష్ట్రాలు తమ ఇష్టానుసారం మూడు అంచెల వ్యవస్థలో మార్పులు చేయడం సాధ్యం కాదు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా, ఈ ప్రతిపాదన చట్టపరంగా, రాజకీయంగా ఎంత వరకు సాధ్యమవుతుందనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కేవలం రాష్ట్ర స్థాయిలో ఒక తీర్మానం చేయడం ద్వారా లేదా ఆర్డినెస్ తీసుకురావడం ద్వారా ఈ వ్యవస్థను రద్దు చేయడం కుదరదని ఒక వేళ కేంద్రం సహకరించకపోతే ఇది న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.